విశాఖ: జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల 79 గ్రామ పంచాయతీలను GVMCలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే జిల్లాలో 89% పట్టణ, 11% గ్రామీణ ప్రాంతం ఉంది. ఈ 4 మండలాల్లో సుమారు 4-5 లక్షల జనాభా ఉంటుంది. 2027 జనాభా గణన తర్వాతే పునర్విభజనకు అవకాశం ఉండటంతో అప్పటివరకు విలీనం ప్రతిపాదనలు అటకెక్కినట్టే తెలుస్తోంది.
SKLM: జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డిని, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై విస్తృతంగా చర్చించారు. సమస్యలను విన్న మంత్రి వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
BPT: బాపట్ల పట్టణంలో ఆదివారం రాత్రి స్థానిక ఆర్ట్స్ కాలేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఓ వ్యక్తిని వేగంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
GNTR: పొన్నూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాత కక్షల వల్లే ఈ గొడవ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
PPM: జిల్లా పర్యటన నిమిత్తం మన్యం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణకు, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్దన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఆదివారం జిల్లా కేంద్రానికి చేరుకున్న రాష్ట్ర మంత్రులకు కలెక్టర్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా మంత్రులను ఆహ్వానించారు.
అల్లూరి: తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.అప్పలనర్సు ఆదివారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి 3 లక్షల మందిని అవుట్ సోర్సింగ్ పేరిట, మరో లక్ష మందిని కాంట్రాక్టు పేరిట తక్కువ వేతనాలతో ఎటువంటి సౌకర్యాలు లేకుండా కొనసాగిస్తోందన్నారు. ఇప్పటికైనా తాత్కాలిక ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
PPM: రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బి. సి.జనార్ధనరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రతో కలిసి బలిజిపేట మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు.
ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన వారపు సంత ద్వారా మొత్తం రూ. 3,98,200 ఆదాయం సమకూరింది. ఇందులో గొర్రెలు, మేకల సంత నుంచి రూ. 2,49,300 లభించగా, పశువుల సంత నుంచి రూ. 1,48,900 రాబడి వచ్చినట్లు యార్డు ఇంఛార్జ్ కార్యదర్శి రాఘవేంద్రకుమార్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు తరలివచ్చనట్లు ఆయన పేర్కొన్నారు.
కాకినాడ: పెద్దాపురంలో తొమ్మిదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పట్టణానికి చెందిన 30 ఏళ్ల యువకుడిపై ఆదివారం పోక్సో కేసు నమోదైంది. బాలిక బయట ఆడుతుండగా.. చేయిపట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడని, బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: వల్లూరు మండల పరిధిలోని పుష్పగిరి క్షేత్రం వద్ద నది ప్రమాదాలకు నిలయంగా మారిన అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ప్రాంతంలో ఇప్పటికే ఎందరో మృత్యువాత పడ్డారని ప్రజలు తెలుపుతున్నారు. ఆ ప్రాంతంలో ఒక సూచిక బోర్డు ఏర్పాటు చేసి ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఎన్నికల ఖర్చుపై వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుని విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డికి ఇటీవల సూచించింది. ఎమ్మెల్యేకు చెందిన సంస్థ ఉద్యోగుల ఖాతాల్లో అదనంగా నగదు జమ చేసి తిరిగి తీసుకుని ఎన్నికల ఖర్చుకు వినియోగించారని ఓ మాజీ ఉద్యోగి ఆమె పై ఫిర్యాదు చేశారు.
TPT: త్వరలో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఓ జంట వేరువేరు చోట్ల సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. కడప(D) సుండుపల్లి(M)నికి చెందిన అనిషా (18), అస్లాంకు ఏడాది కిందట.. ఈ జూన్‌లో పెళ్లి ఖాయం అయింది. అయితే భాగంపల్లెలో అనిషా ఉరి వేసుకుని చనిపోగా.. చంద్రగిరి పరిధిలో అస్లాం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మృతికి గల కారణం తెలియాల్సి ఉంది.
W.G: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన భీమవరం ఎంపీడీవో కార్యాలయంలో భారీ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీ, కియా మోటార్స్, బాటా ఎలక్ట్రానిక్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు గల యువతీ, యువకులు అర్హులని పేర్కొన్నారు.
చిత్తూరు: కుప్పం టీడీపీలో కోఆర్డినేషన్ కనిపించడం లేదని, ఎవరికి వాళ్లు గ్రూపులు కట్టుకుని పోతున్నారని CM చంద్రబాబు పలువురు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో తన PAగా ఉన్న మనోహర్ 6 ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని అప్పుడు కోఆర్డినేషన్ సమస్య ఏనాడూ రాలేదని, కుప్పం తన నియోజకవర్గమనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పనిచేయాలని CM హెచ్చరించినట్లు సమాచారం.
కడప జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖకు రూ.195.21 కోట్లు ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. జిల్లాలో రవాణా శాఖకు కడపలో డీటీసీ, ప్రొద్దుటూరులో ఆర్టీవో ,పులివెందుల, బద్వేల్, రాజంపేటలో MVI కార్యాలయాలు ఉన్నాయి. వీటి నుంచి లైఫ్ టాక్స్ రూపంలో రూ.168.22 కోట్లు, ఫీజుల ద్వారా రూ.16 కోట్లు,పెనాల్టీల ద్వారా రూ.6.70 కోట్లు, యూజర్ ఛార్జీల ద్వారా రూ.4 కోట్లు ఆదాయం లభించింది.