KRNL: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. మంగళవారం రాత్రి 11 నుంచి తెల్లవారుజాము వరకు ఒకటవ పట్టణ సీఐ మారుతి శంకర్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలోని తనిఖీలు చేసినట్లు తెలిపారు. కొండారెడ్డి బురుజు వద్ద క్యూఆర్టీలు, బ్లూ కోల్ట్స్ సిబ్బందికి రాత్రి గస్తీ విధులపై దిశా నిర్దేశం చేశారు.
CTR: వేసవి సెలవుల్లో పాఠశాలలు తెరవరాదని DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు సెలవుల్లో తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోటీ పరీక్షలు శిక్షణా శిబిరాల పేరుతో పాఠశాలలు నడిపితే నోటీసులు లేకుండానే తగు చర్యలు తీసుకుంటామన్నారు. తప్పనిసరిగా జూన్ 12 వరకు సెలవులు అమలు చేయాలన్నారు.
W.G: తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వెంటనే వేతన బకాయిలు చెల్లించాలనీ కోరుతూ బుధవారం ఉదయం ఆసుపత్రి ముందు ఈ ఆసుపత్రి కార్మికులు ధర్నా నిర్వహించారు. గత మూడునెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదనీ, కనీసం కాంట్రాక్టర్ కూడా ఫోన్లో అందుబాటులో లేరని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ATP: గుంతకల్లు పట్టణంలోని 10, 11వ వార్డుకు చెందిన 100 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. వీరిని మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి పార్టీ కండువా చేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన పలువురు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీని వీడి టీడీపీలోకి చేరామన్నారు.
TPT: గతేడాది కంటే ఈసారి మామిడి పంట పరిస్థితులు మెరుగ్గా ఉండే అవకాశముందని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, పక్వానికి వచ్చిన కాయలనే కోయాలని సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లతో ఆయన సమీక్ష చేశారు. రైతులకు న్యాయమైన ధరలు అందేలా చూస్తామన్నారు. కొనుగోలు, రవాణా, నిల్వ సదుపాయాలపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ELR: వేసవి దృష్ట్యా వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఎస్ఈ సాల్మన్ రాజు తెలిపారు. వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఏలూరు (9440812702, 9440812704), జంగారెడ్డిగూడెం (9491049797), నూజివీడు (9440811746) సంప్రదించాలని కోరారు.
అన్నమయ్య: పెట్రోల్, డీజిల్ కొరతతో గత ఐదు రోజులుగా బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అధికారులను రంగంలోకి దింపడంతో పెట్రోల్ బంక్ యజమానులతో సమావేశమై సరఫరా సమస్యలను పరిష్కరించారు. దీంతో కోడూరు పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరత సాధారణ సిద్ధికి చేరుకుంది.
KRNL: చెక్ బౌన్స్ కేసులో నేరం రుజువవడంతో ఆదోనికి చెందిన బసిరెడ్డికి కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. 2020లో హరినాథబాబు రూ. 6 లక్షలు అప్పుగా ఇవ్వగా, తిరిగి చెల్లించేందుకు ఇచ్చిన చెక్ బ్యాంకులో బౌన్స్ అయింది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. విచారణ అనంతరం నిందితుడికి నిన్న శిక్ష వేసింది.
W.G: తణుకు పట్టణ పరిధిలోని ఇరగవరం కాలనీకు వెళ్లే రోడ్డు మార్గాన్ని అధికారులు మళ్లించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఇరగవరం రోడ్డు కాలనీకి వెళ్లే మార్గంలో కల్వర్టు నిర్మాణాన్ని అధికారులు చేపట్టారు. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిషేధించారు. ఈ మార్గంలో ప్రయాణించాల్సిన వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
TPT: నాగలాపురం మండలం సురుటుపల్లిలోని శ్రీప్రసన్నకోండేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వరునికి బుధవారం ప్రదోష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ పద్మనాభ రాజు తెలిపారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు జరిగే ఈ పూజలకు భక్తులు పూజా సామాగ్రి విరాళంగా అందించవచ్చన్నారు. అభిషేక పూజలో పాల్గొనే భక్తులు రూ.500 చెల్లించి టికెట్ పొందాలని ఈవో లత కోరారు .
CTR: పాలసముద్రం మండలంలోని 2024-25 సంవత్సరంలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న డీపీఎల్ లిక్కర్, సారాను ఎక్సైజ్ ఏఈఎస్ కృష్ణ కిషోర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ రెడ్డి సమక్షంలో ధ్వంసం చేశారు. స్టేషన్ పరిధిలో 24 కేసుల్లో 331 లీటర్ల సారాయి, ఆరు కేసుల్లో 34.38 లీటర్ల డీపీఎల్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేశామని వారు తెలిపారు.
NDL: అవుకు శ్రీ భూ లక్ష్మి చెన్నకేశవ స్వామి తిరుకళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి మే 6 వరకు వేడుకలు జరగనున్నాయి. బుధవారం స్వామివారికి ధ్వజారోహణ నిర్వహించనున్నారు. 30న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనుండగా, అదే రోజు స్వామివారి కళ్యాణం వైభవంగా జరగనుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
PPM: అన్నదాత సుఖీభవ నిధులు తనకు కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం జమ చేసిందని పార్వతీపురం జిల్లా జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డికి పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఫిర్యాదు చేశారు. తనకు జమ అయిన రూ.14 వేలను తిరిగి తీసుకోవాలని జేసీని కళావతి విజ్ఞప్తి చేశారు. అర్హులైన లబ్ధిదారులందరికీ సక్రమంగా సంక్షేమాన్ని అందించి, న్యాయం చేయాలని జేసీని కళావతి కోరారు.
PLD: రెంటచింతల మండలానికి చెందిన ఓ వివాహితపై విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీవనోపాధి కోసం విశాఖలో ఉంటున్న బాధితురాలు ఈ నెల 26న నడికుడి వైపు ప్రయాణిస్తుండగా, జనరల్ బోగీలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆమెను ఏసీ బోగీకి తీసుకెళ్లి దాడికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
NLR: కందుకూరు (M) కొండముడుసుపాలెం హైవే సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. సింగరాయకొండ వైపు నుంచి కడపకు వెళ్తున్న బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని ఏరియా వైద్యశాలకు తరలించారు.