NTR: తిరువూరు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉచిత వేసవి శిక్షణ తరగతులలో భాగంగా ఇంగ్లీష్‌పై ఉపాధ్యాయుడు రాంప్రదీప్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు నిత్య జీవితంలో వివిధ సందర్భాలలో ఎదురయ్యే పరిస్థితులను తీసుకుని వాటిని ఆంగ్లంలో ఏ విధంగా ఉపయోగించాలి. ఆంగ్లంలో మాట్లాడేటప్పుడు సహజంగా చేసే కొన్ని పొరపాట్లు మొదలైన వాటి గురించి వివరించారు.
ATP: ధర్మవరం మండలం కునుతూరు అహుడా లేఅవుట్‌లో అభివృద్ధి పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన లేఅవుట్‌ను సందర్శించి రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. నాణ్యతతో కూడిన పనులను వేగవంతం చేయాలని, గడువులోగా లేఅవుట్‌ను సిద్ధం చేయాలని సూచించారు.
VSP: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “వరకట్న నిషేధ చట్టం-1961”పై అవగాహన కార్యక్రమం పెందుర్తిలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఏ సన్యాసినాయుడు వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరమని తెలిపారు. నేరస్తులకు జైలు శిక్షలు, జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేయాలని, 1098 వంటి హెల్ప్‌లైన్‌లను వినియోగించుకోవాలని సూచించారు.
NDL: విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసిస్తూ జిల్లా APUWJ నేతలు ఎస్పీ సునీల్ శేరాన్‌కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కార్యదర్శి సభ్యులు శ్యాంసుందర్, జిల్లా అధ్యక్షుడు మధుబాబు నేతృత్వంలో ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విలేకరుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
TPT: తొట్టంబేడు(M) చోడవరంలో నిర్వహించిన రీసర్వే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు. భూ సర్వే ప్రక్రియను పర్యవేక్షించి, సమస్యలపై గ్రామస్థులతో నేరుగా మాట్లాడారు. భూ రికార్డుల పారదర్శకత కోసమే ఈ ప్రక్రియ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ ఆర్. గోవిందరావుతో పాటు రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
BPT: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వేటపాలెం మండలం రావూరిపేటకు చెందిన దంపతులు మాజేటి ప్రభాకర్(33)-పార్వతి(24) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
సత్యసాయి: ధర్మవరం పట్టణంలో వైభవంగా జరిగిన శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మరథోత్సవంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చి రథాన్ని లాగుతుండగా మంత్రి వారితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
అన్నమయ్య: గాలివీడు మండలంలో ‘జలధార-జలహారతి’ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కాలువలు, చెరువుల పునరుద్ధరణ పనులతో వర్షపు నీటి సంరక్షణకు తోడు సాగునీటి లభ్యత పెరుగుతోంది. రూ.5 లక్షల వ్యయంతో చేపట్టిన ఫీడర్ కాలువ పనుల ద్వారా సుమారు 210 ఎకరాలకు నీరు అందనుంది. ఈ కార్యక్రమం గ్రామీణ ఉపాధిని పెంచుతూ రైతులకు ఆశాజ్యోతిగా నిలుస్తోంది.
AKP: జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన ఎండలు వడగాల్పులు నేపథ్యంలో పారిశ్రామిక ప్రమాదాలను అరికట్టేందుకు, కార్మికుల భద్రతను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో పరిశ్రమల భద్రత ప్రమాణాలపై పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలలో భద్రత తనిఖీలు నిర్వహించాలన్నారు.
PLD: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి కాన్వాయ్‌పై దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కారంపూడిలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో అలజడులు సృష్టించేందుకే పిన్నెల్లి సోదరులు ఈ కుట్ర పన్నారని మండిపడ్డారు. అభివృద్ధిని ఓర్వలేకనే ఇలా చేస్తున్నారన్నారు. గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
E.G: మంగళగిరిలో నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకేష్ యువ నాయకత్వానికి ప్రతీకగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని, జాతీయ స్థాయిలో పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
కృష్ణా: గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో జనసేన పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు బుధవారం మొక్కలను నాటారు. ఆసుపత్రి పరిసరాలను పచ్చదనంతో నింపేందుకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని అన్నారు. పచ్చని వాతావరణం ప్రజల ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన నేతలు పాల్గొన్నారు.
CTR: ఆస్తి పన్నుపై రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిబేట్ రేపటి(గురువారం)తో ముగియనుంది. దీంతో బుధవారం సాయంత్రం పుంగనూరు పట్టణంలోని గృహాల యజమానులు పన్నులు చెల్లించేందుకు పురపాలక కార్యాలయానికి క్యూ కట్టారు. ప్రజల సౌకర్యార్థం కమిషనర్ మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు ప్రత్యేకంగా రెండు కౌంటర్లను ఏర్పాటు చేశారు.
ప్రకాశం: పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చూపించుకునేందుకు గుంటూరుకు వెళ్లారు. ఈ క్రమంలో దొంగలు ఆయన ఇంటిలో బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదును దోచుకు వెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ASR: రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో, ఆరోగ్య శాఖ సమన్వయంతో ప్రభుత్వం సరికొత్త అత్యవసర చికిత్స పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ నిషాంతి తెలిపారు. ఈ మేరకు బుధవారం పీఎం రహత్ పథకం-రోడ్డు ప్రమాద బాధితులకు అభయ హస్తం గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణ సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 112కు కాల్ చేయవచ్చన్నారు