ASR: ఉపాధి హామీ పథకంలో ఫేషియల్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని గిరిజన సంఘం డుంబ్రిగూడ మండలం అధ్యక్షుడు పాంగి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండలంలోని లోగిలి గ్రామంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఫేషియల్ విధానం వల్ల మారుమూల ప్రాంతాలలో గిరిజన శ్రామికులు అనేక అవస్థలు పడుతున్నారని ఆయన తెలియజేశారు. ఈ విధానం వల్ల సమస్య తప్ప ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
CTR: వీకోటలో హత్యకు గురైన జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు మంగళవారం పరామర్శించారు. ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దోషులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.
మార్కాపురంలో గంజాయి నిర్మూలనకు పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, సీఐ అల్తాఫ్ హుస్సేన్ గంజాయి సమాచారానికి రూ.10 వేల బహుమతి ప్రకటించారు. సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. యువత భవిష్యత్తు కోసం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
TPT: తిరుపతిలో నిర్వహించనున్న తాతయ్యగుంట గంగజాతరకు అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేసి విజయవంతం చేయాలని ఇంఛార్జ్ కమిషనర్ శారదా దేవి అధికారులకు ఆదేశించారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, మజ్జిగ పంపిణీ, సీసీ కెమెరాలు, మొబైల్ టాయిలెట్స్, అగ్నిమాపక చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో శుభ్రత, చెత్త తొలగించాలన్నారు.
PLD: సంతగుడిపాడు గ్రామంలోని స్వర్ణ సచివాలయాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ పనితీరు, సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణతో పాటు ప్రజలకు అందుతున్న సేవలను సమగ్రంగా సమీక్షించారు. ఇలాంటి ఆకస్మిక తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదుగా 60 మంది దివ్యాంగులకు రూ.60 లక్షల విలువైన మూడు చక్రాల స్కూటర్లు ఉచితంగా పంపిణీ చేశారు. జీవనోపాధి మెరుగుదలకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని, దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని కలెక్టర్ తెలిపారు.
VZM: గజపతినగరం శాఖ గ్రంథాలయంలో మంగళవారం గ్రంథాలయ అధికారి యజ్జల స్వప్న ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవిలో కొంత సమయాన్ని గ్రంథాలయానికి కేటాయించాలని సూచించారు. వేసవి విజ్ఞాన శిబిరాలు నెల రోజులపాటు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
PPM: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఇంధన కొరతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని పలు పెట్రోల్ బంకులతో పాటు, సమీప గ్రామీణ ప్రాంతాల బంకులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బంకుల్లో ఉన్న నిల్వల రిజిస్టర్లను తనిఖీ చేసి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
NTR: తిరువూరులో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హై కోర్ట్ జడ్జి చీకటి మానవేంద్ర రాయ్‌ను బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జనార్ధన రావు, కృష్ణా రెడ్డి కలసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వెంకటరెడ్డి, హేమంత్ కుమార్, నవీన్ తదితరులు ఉన్నారు.
SKLM: రాష్ట్రంలో ఇంధన కొరత ప్రభుత్వ అసమర్థత ఫలితమని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. మందస మండలం హరిపురం ఫ్లైఓవర్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ లభించక వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారం రోజులుగా బంకుల వద్ద క్యూలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ యూజీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, M.Ed, MPEd, లా కళాశాలలకు మే 1వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు మంగళవారం వీసీ ప్రొఫెసర్ వెంకట బసవరావు తెలిపారు. మే 1 నుంచి జూన్ 14వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. అటు, జూన్ 15వ తేదీన కళాశాలలు పునఃప్రారంభమవుతాయని ఈ మేరకు వీసి వెల్లడించారు.
ATP: గుంతకల్లు ఎంఈవో మస్తాన్ రావుకు PDSU విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై, ప్రైవేట్ టీచర్లను ఇంటింటా అక్రమ అడ్మిషన్లకు పంపిస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
AKP: అచ్యుతాపురం మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.రాము తెలిపారు. ఈ మేరకు అచ్యుతాపురం మండల కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. 140వ అంతర్జాతీయ మేడే సందర్భంగా మండలంలో వాడవాడల పతాకావిష్కరణలు నిర్వహిస్తామన్నారు. మేడే స్ఫూర్తితో కార్మికులకు అండగా నిలిచి పోరాటాలు చేస్తామని తెలిపారు.
GNTR: రాష్ట్ర సచివాలయంలో చేనేత రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రి సవిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆప్కో షోరూమ్‌లలో అమ్మకాలు పెంపు, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్, సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలు వంటి విషయాలపై చర్చించారు. అర్హులైన చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందజేయాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు.
NLR: ప్రభుత్వం హజ్ యాత్రికులకు రూ. లక్ష చొప్పున సబ్సిడీ ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1,985 మంది యాత్రకు వెళ్లనున్నారు. నెల్లూరు నుంచి 160 మందిని ఎంపిక చేశారు. వీరందరికీ వర్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ ట్రాలీ సూట్ కేసులు, మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. యాత్రికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించామని చెప్పారు.