• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చిలకలూరిపేటలో డీజిల్ కటకట

PLD: చిలకలూరిపేటలో ఇంధన కొరత తీవ్రరూపం దాల్చింది. నిల్వలు లేక పలు పెట్రోల్ బంకుల్లో ఇవాళ ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధనం దొరక్క రవాణా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాక్టర్లకు డీజిల్ లేక వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అధికారులు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

April 27, 2026 / 10:38 AM IST

మైనార్టీ సమస్యలపై మారుతి నాయుడుకు వినతి

KRNL: ఆదోని పట్టణంలోని మూడో వార్డు పింజరిగేరి సయ్యద్ పేటకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు ఇవాళ టీడీపీ యువ నాయకుడు మారుతి నాయుడును కలిశారు. దర్గా మైదానం అభివృద్ధికి ఎర్రమట్టి అందించాలని, స్థానిక సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై స్పందించిన మారుతి నాయుడు మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

April 27, 2026 / 10:34 AM IST

బొలెరో వాహనం బోల్తా పడి పలువురికి గాయాలు

NDL: నంద్యాల- గిద్దలూరు రహదారి నల్లమల ఘాట్ రోడ్లో బొలెరో వాహనం బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. సోమవారం గాజులపల్లికి చెందిన కూలీలు గిద్దలూరులో పని నిమిత్తం వెళ్తున్నారు. నల్లమల్ల ఘాట్లో ఎస్. టర్నింగ్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పరువురికి గాయాలయ్యాయి. 108 వాహనాల్లో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

April 27, 2026 / 10:32 AM IST

బంకుల్లో రద్దీ నియంత్రణకు చర్యలు: MRO

WG: మొగల్తూరు(M)లోని పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత వల్ల ఏర్పడిన రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టినట్లు MRO కె.రాజ్ కిషోర్ ఆదివారం తెలిపారు. మండలంలోని ఆరు బంకుల్లో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం బంకుల వద్ద ఎటువంటి రద్దీ లేదని వివరించారు. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని ఆయన వెల్లడించారు.

April 27, 2026 / 10:30 AM IST

మే ఒకటి నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 వరకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు ఇవాళ శాప్ కోచ్ అబ్బు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 9, సాయంత్రం 4.30 నుంచి 8 గంటల వరకు కరాటే, తైక్వాండో, యోగా, కబడ్డీ, చెస్, బాక్సింగ్, అథ్లెటిక్స్ క్రీడల్లో అనుభవజ్ఞులైన కోచ్‌లు శిక్షణ ఇస్తారన్నారు.

April 27, 2026 / 10:30 AM IST

పెట్రోల్ బంకులను పరిశీలించిన ఎస్సై

ప్రకాశం: పొదిలి SI రాజేశ్ ఇవాళ ఉదయం పట్టణంలోని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నాణ్యత, కొలతల్లో సరైన ప్రమాణాలు పాటిస్తున్నారా అని పరిశీలించారు. బంక్ యాజమాన్యాలకు వినియోగదారులను మోసంచేసే అక్రమాలు చేయకూడదని హెచ్చరించారు. మీటర్లు సరిగా పనిచేస్తున్నాయా, సరైన పరిమాణంలో ఇంధనం అందిస్తున్నారా అని ప్రత్యేక దృష్టి సారించారు.

April 27, 2026 / 10:27 AM IST

కొత్తవలస నూతన సీఐగా విజయకుమార్

VZM: కొత్తవలస పోలీస్ స్టేషన్ నూతన సీఐగా విజయకుమార్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆయన విశాఖ రేంజ్ వీఆర్ నుంచి కొత్తవలసకు బదిలీ‌పై వచ్చారు. ఈయన 1998 బ్యాచ్‌కు చెందినవారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు విధులు నిర్వహించిన షణ్ముఖరావుకు వీఆర్‌కు బదిలీ చేసారు. సీఐ మాట్లాడుతూ.. కొత్తవలస ట్రాఫిక్‌పై దృష్టి సారిస్తూ, రాత్రి నిఘా ముమ్మరం చేస్తానని చెప్పారు.

April 27, 2026 / 10:20 AM IST

‘గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలు’

GNTR: ఫిరంగిపురం శాఖ గ్రంథాలయంలో రేపటి నుంచి జూన్ 6వ తేది వరకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి దుర్గా రెడ్డి తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిబిరాల్లో పాల్గొనాలని కోరారు. ఈ శిబిరాల ద్వారా మానసిక వికాసానికి దోహదపడే వివిధ కార్యక్రమాలు ప్రతిరోజూ నిర్వహించబడతాయని తెలిపారు.

April 27, 2026 / 10:20 AM IST

ఉత్తమ విద్యార్థులను సత్కారించిన ఎమ్మెల్యే

WG: ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులో ఇంటర్ ఫలితాల్లో ప్రతిభచూపిన విద్యార్థులను ఎమ్మెల్యే సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో సదుపాయాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు.

April 27, 2026 / 10:13 AM IST

అగ్నికి ఆహుతై మొక్కజొన్న పంట

NDL: ఆళ్లగడ్డ మండలం చిన్నకందుకూరులో ఇవాళ ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయ్యింది. మొక్కజొన్న కోత మిషన్ పంట కోస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో పంటపై నిప్పురవ్వలు పడటంతో 20 ఎకరాలకు పైగా పంట కాలిపోయింది. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.

April 27, 2026 / 10:11 AM IST

వీరబల్లి మండలంలో జాతర్లపై ఆంక్షలు

KDP: వీరబల్లి మండలంలో జరగనున్న జాతర్లలో డీజేలకు అనుమతులు లేవని ఎస్సై సుస్మిత స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై గుర్రప్పగారిపల్లె, దిగువరాచపల్లి గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర గ్రామాల్లో అనుమతులు ఇచ్చి తమ గ్రామాలకు మాత్రమే ఆంక్షలు విధించడం సరైంది కాదని వారు ప్రశ్నిస్తున్నారు.

April 27, 2026 / 10:11 AM IST

చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

KRNL: రాష్ట్ర అభివృద్ధి సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలులో ఇవాళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం గర్వకారణమని తెలిపారు. రాష్ట్రాన్ని ఐదేళ్లలో దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

April 27, 2026 / 10:08 AM IST

కొత్తపల్లి అగ్రహారంలో ‘విద్యా మిత్ర’ కార్యక్రమం

E.G: పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యా మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన చదువు, మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ ITDP అధ్యక్షులు అబ్బిశెట్టి సత్తిరాజు, పాఠశాల కమిటీ ఛైర్మన్ రెడ్డి దుర్గ, ఉపాధ్యాయురాలు వై.అశ్విని ఉన్నారు.

April 27, 2026 / 10:07 AM IST

ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన వ్యక్తి అరెస్ట్

కోనసీమ: కాట్రేనికోన మండల పరిధిలోని ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన ఇసుక పట్ల నాగేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రహ్మసమేథ్యం గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ మోసానికి పాల్పడినట్లు కాట్రేనికోన ఎస్సై అవినాష్ తెలిపారు. నిందితుడిని ముమ్మిడివరం కోర్టులో హాజరుపరచగా న్యాయ స్థానం 15 రోజులు రిమాండ్ విధించిందని తెలిపారు.

April 27, 2026 / 10:02 AM IST

నేడు కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కలెక్టర్ పర్యటన

నెల్లూరు: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సోమవారం కావలి పట్టణంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కావలి పట్టణం బాపూజీ నగర్ మున్సిపల్ ప్లాట్స్ నందు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాచే సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కార్యకర్తలు గమనించాలన్నారు.

April 27, 2026 / 10:02 AM IST