కోనసీమ: రావులపాలెంలోని శ్రీ సత్యసాయి సేవా కేంద్రం నందు శుక్రవారం నుండి ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టెన్త్ పాస్ అయిన అభ్యర్థులకు కంప్యూటర్ డీసీఏ కోర్సు ఉచితంగా నేర్పబడునని పేర్కొన్నారు. శిక్షణ పొందేవారు శుక్రవారం నుండి జరిగే శిక్షణలో పాల్గొని పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
విశాఖ ఆర్టీసీ ఇన్ గేట్ జంక్షన్ వద్ద అంబేద్కర్ 135వ జయంతి ప్రచారంలో భాగంగా కరపత్రాలను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఏప్రిల్ 14న జరిగే ర్యాలీలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అన్నమయ్య: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) అన్నమయ్య జిల్లా రాయచోటి తాలూకా కమిటీ ఎన్నికలు నేడు రాయచోటి ఏరియా హాస్పిటల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో సాయికుమార్ తాలూకా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా రవీంద్ర, ట్రెజరర్‌గా వెంకటేష్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ ఎన్నికైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
NDL: మహానంది మండలం తిమ్మాపురం మోడల్ స్కూల్లో ఈ నెల 12న జరగనున్న ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శుక్రవారం ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు. ఉ.10 గంటల నుంచి మ. 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష రాసే విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. నిబంధనల మేరకు పరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు.
VZM: రాష్ట్ర రాజధాని అమరావతి కాదు కమ్మరావతి అని ప్రజలు చర్చించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. ఈ మేరకు గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. రాజధాని నిర్మాణంపై ప్రజలు మేధావులు చర్చించుకోవలసిన అవసరం ఉందన్నారు. అలాగే, ప్రభుత్వం సాధ్యమైన పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారని పేర్కొన్నారు.
PPM: పూర్ణపాడు-లాభేసు వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ సీపీఎం నాయకులు శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. జిల్లా కమిటీ సభ్యుడు సాంబమూర్తి గాజులగూడలో మోకాళ్లపై నడుస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వంతెన పూర్తైతే సుమారు 40 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. “సీఎం సాయి కాంత్ వర్మ IAS” పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతా అసలు అధికారికది కాదని అధికారులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ అధికారిక ఫేస్బుక్ పేజీ “District Collector Guntur” మాత్రమేనని వెల్లడించారు. ప్రజలు నకిలీ అకౌంట్లను నమ్మి మోసపోవద్దన్నారు.
ATP: అనంతపురం నగరంలో పన్నుల చెల్లింపునకు ప్రజలకు అనువుగా ఐదు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు తెలిపారు. 2026- 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను, ఇంటి ఖాళీ స్థలం పన్ను ఏక మొత్తంలో చెల్లించే వారికి 5 శాతం రాయితి పొందవచ్చు అన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
TPT: తిరుచానూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పట్టాలపై వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. రైలు నుంచి జారి పడ్డాడా? ఆత్మహత్యకు ప్రయత్నించాడా? అనేది తెలియాల్సి ఉంది. శుక్రవారం తెల్లవారుజామున ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి సంబంధించిన సమాచారం తెలిస్తే తమకు తెలపాలని రైల్వే పోలీసులు కోరారు.
KRNL: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ శుక్రవారం నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలు నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నా, సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదన్నారు.
కోనసీమ: కాట్రేనికోన మండలం పెనుమళ్ల పంచాయితీ కార్యాలయాన్ని ఎంపీడీవో రాజేశ్వర్ రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బంది హాజరు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పౌర సేవలు వేగంగా అందించాలని సూచించారు. సేవలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు.
CTR: SRపురం మండలం పుల్లూరు క్రాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లంపల్లికి చెందిన ముగ్గురు బైక్‌పై పుత్తూరుకు బయల్దేరారు. మార్గమధ్యంలో చిత్తూరు వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి ఆమె స్వయంగా వినతులు స్వీకరించారు. విద్య, వైద్యం, పెన్షన్లు వంటి వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.
GNTR: తెనాలి చిన రావూరులోని ప్రభుత్వ ITI శిక్షణ కేంద్రంలో ఈ నెల 13న నేషనల్ అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రావి చిన వెంకటేశ్వర్లు తెలిపారు. ITI ఉత్తీర్ణులైన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం అని చెప్పారు. అప్రెంటిస్ మేళాలో 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయన్నారు. ITI విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ATP: రైల్వే డబ్లింగ్ పనుల కారణంగా గుంతకల్లు – కాచిగూడ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 10 నుంచి 18 వరకు గుంతకల్లు-కాచిగూడ రైలు (57411), ఈ నెల 11 నుంచి 19 వరకు కాచిగూడ-గుంతకల్లు రైలు (57412) తొమ్మిది రోజుల పాటు నిలిచిపోనున్నాయి. ప్రయాణికులు ఈ మార్పును గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.