VZM: బొబ్బిలి DSP గా గోవిందరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ DSPగా పని చేసిన భవ్యరెడ్డిను సరెండర్ చేసిన నేపథ్యంలో VZM DSP గా పనిచేస్తున్న ఆయనను బొబ్బిలి బదిలీ చేయడంతో బాధ్యతలు స్వీకరించి బొబ్బిలి కోటలో స్దానిక MLA బేబినాయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్లో గంజాయి, సైబర్ నేరాలు నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.
అనకాపల్లి జిల్లాలో నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేటనిషేధం అమలులోకి రానుంది. జూన్ 14 వరకు వేట నిషేధం కొనసాగుతుంది. సముద్రంలో చేపల సంతాన ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ప్రతి ఏట మే 14 నుంచి జూన్ 15 వరకు ప్రభుత్వం వేట నిషేధాన్ని అమలు చేస్తుంది. జిల్లాలో 31 మత్స్యకార గ్రామాల్లో 12,644 మంది మత్స్యకారులకు ప్రభుత్వం వేట నిషేధ సమయంలో భృతిని అందజేస్తుంది.
PPM: జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి సోమవారం ఆయన ఛాంబరులో భామిని MPDO ఎస్.వసంత కుమారిని శాలువాతో సత్కరించారు. సంపూర్ణత అభియాన్ 2.0 సక్సెస్ మీట్‌లో భాగంగా ఆమెను సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయిలో సంపూర్ణత అభియాన్ 2.0 విజయవంతం చేయడంలో పూర్తి బాధ్యత వహించినందుకు సత్కరించినట్టు తెలిపారు.
SKLM: శ్రీకాకుళం అగ్నిమాపక శాఖ వారోత్సవాలు మంగళవారం నుంచి వారం రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగహన కల్పించేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి కె. మోహనరావు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి, ప్రజలు భాగస్వామ్యులై, విజయవంతం చేయాలని కోరారు.
W.G: జిల్లాలో ఈనెల 23 వరకు నిర్వహించే 8వ ‘పోషణ పక్వాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా పోషకాహార లోప నివారణపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికీ సమతుల్య ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.
VSP: జీవీఎంసీ 78వ వార్డు ఉక్కునగరంలో ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకూ ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని నిర్వహించనున్నట్టు వార్డు మాజీ కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ అప్డేట్, ఫోటో మార్పిడి వంటివి చేపడుతున్నట్లు తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్‌లోని వార్డు సచివాలయంలో జరిగే సేవలను వినియోగించుకోవాలన్నారు.
E.G: పౌరులు తమ వివరాలను స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే ‘సెల్ఫ్-ఎన్యుమరేషన్’ విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చిందని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఉద్యోగ, వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాల్లో నివసించే వారికి ఇది ఎంతో ప్రయోజనకరమన్నారు. ఇంటి నుంచే సులభంగా వివరాలు నమోదు చేసుకునే ఈ సువర్ణ అవకాశాన్ని పౌరులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
W.G: తాడేపల్లిగూడెం (M) వెంకట రామన్నగూడెంలో సోమవారం సాయంత్రం దయ్యాల సూర్యనారాయణను అదే గ్రామానికి చెందిన కిషోర్ కిటికీ అద్దంతో మణికట్టుపై కోసి హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. మృతుడు ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులో పనిచేస్తున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
అనంతపురంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కోరారు. హైదరాబాద్‌లోని ఏఎల్ఈఏపీ కార్యాలయంలో ఆ సంస్థ ఛైర్మన్ రమాదేవిని ఆయన కలిశారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఎంఎస్ఎంఈ పార్కు అందుబాటులో ఉందని, కొత్తగా పరిశ్రమలు స్థాపించే మహిళలకు ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు.
KRNL: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. సోమవారం అత్యధికంగా కర్నూలులో 43, నంద్యాల, కడప, విజయవాడ, గుంటూరులలో 42 డిగ్రీల వేడి నమోదైంది. అనంతపురం, గోదావరి జిల్లాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
PPM: రెవెన్యూ కార్యాలయాల చుట్టు ప్రజలు తిరిగే పని లేకుండా సేవలు అందించాలని JC సి.యశ్వంత్ కుమార్ రెడ్డి సూచించారు. సోమవారం కలక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూమి రీ-సర్వేను గడువులోగా పూర్తి చేసి, సరిహద్దు వివాదాలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ దంపతులు కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం భేటీ అయ్యారు. ముందుగా కలెక్టర్‌ను వారు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయాల్సిన పట్టణ ఆరోగ్య కేంద్రాల గురించి విజ్ఞప్తి చేశారు.
NDL: శ్రీశైలం పోలీస్‌స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఓ ఇనుప గేటును కారు బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులంతా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం దర్శనానికి హైదరాబాద్ నుంచి 9 మంది భక్తులు వెళ్లారు. కాగా, కుక్కను తప్పించబోయి ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.
తిరుపతి నగరంలో ఈట్ స్ట్రీట్‌లో దుకాణాలు పొందిన వ్యాపారులు ఈ నెల 16 నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. సోమవారం తాళాలు అందజేసి నిబంధనలు వివరించారు. కేటాయించిన ఆహార పదార్థాలనే విక్రయించాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం తప్పనిసరి అని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
CTR: జిల్లాలో నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అగ్నిమాపక శాఖాధికారి పెద్దిరెడ్డి తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో అగ్ని ప్రమాద నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. 6 రోజులపాటు ఈ వారోత్సవాలు జరుగుతాయని చెప్పారు.