PLD: మాచర్ల పురపాలక సంఘానికి బకాయిల చెల్లింపులు కొనసాగుతున్నాయి. పట్టణానికి చెందిన ఓ యాజమాన్యం రూ.32 లక్షలు, చెల్లించించింది. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడిన యాజమాన్యాలను కమిషనర్ డీ. వేణుబాబు అభినందించారు. ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ, 5% రిబేట్ అందుబాటులో ఉన్నందున ప్రజలు, వ్యాపారులు బకాయిలను వెంటనే చెల్లించాలని సూచించారు.
KRNL: ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్ వీరాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం మంగళవారం కనులపండుగగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో హక్కులు అవమాధి కార్యక్రమం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
NDL: సంజామల మండలం నొస్సంలో ఇవాళ సాయంత్రం నుంచి రేపటి వరకు జరుగుతున్న దేవర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు రూట్ మళ్లించినట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. జమ్మలమడుగు నుంచి వచ్చే వాహనాలను గుండ్లకుంట వద్ద మళ్లించి పెద్దముడియం వైపు దారి మళ్లిస్తామన్నారు. KKL నుంచి జమ్మలమడుగు వెళ్లేవారు ALG మార్గం వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు సహకరించాలని కోరారు.
కోనసీమ: ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి, ఉన్నత విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొత్తపేట విశ్వ కవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.14.44 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి విద్యార్థులు రేపటి రాష్ట్ర భవిష్యత్తు అని అన్నారు.
W.G: నరసాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో మంగళవారం వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు, శాస్త్రవేత్త సుబ్బారావు చిన్నారులకు ఆహ్వానం పలికారు. ముఖ్య అతిథిగా MEO పుష్పరాజ్యం పాల్గొని తరగతులను ప్రారంభించారు. జాతీయ నాయకుల జీవిత చరిత్రలు చదవాలని, సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించి పుస్తక పఠనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ATP: అనంతపురం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను జిల్లా నూతన అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, పాలనాపరమైన అంశాలపై మంత్రితో అసిస్టెంట్ కలెక్టర్ చర్చించారు. యువ అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
PLD: వినుకొండలో నూతనంగా నిర్మిస్తున్న గిరిజన గురుకుల పాఠశాల భవన పనులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మంగళవారం పరిశీలించారు. చెక్కవాగు వద్ద రూ.5 కోట్లతో ఈ భవనం నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ పడొద్దని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యార్థం గడువులోగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు.
E.G: రబీ కోతల సమయంలో యంత్రాలకు డీజిల్ అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు వైసీపీ ఇంచార్జ్ తలారి వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కొవ్వూరులో పెట్రోల్, డీజిల్ కొరతపై నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని మండిపడ్డారు.
KRNL: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్‌ను నెట్ జీరో, హెల్తీ క్యాంపస్‌లుగా అభివృద్ధి చేయాలని ఇవాళ కలెక్టర్ డా.ఏ.సిరి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో సంక్షేమ, విద్యుత్, నెడ్ క్యాప్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ ఆదా, పునర్వినియోగ శక్తి, పరిశుభ్రతపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
NLR: చేజర్ల మండలం ఆదూరు పల్లి బోడిపాడు వద్ద ఉన్న పెట్రోల్ బంకులను చేజర్ల తహసీల్దార్ మస్తానయ్య మంగళవారం తనిఖీ చేశారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా ప్రభుత్వం సరఫరా చేస్తుందని ఎక్కడైనా వాటిని పట్టకుండా వాహనదారులకు ఇబ్బందులు గురిచేస్తే కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
PPM: పాలకొండలోని పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమివ్వడం, ఇంధనం దొరకక వాహనదారులు అల్లాడుతున్న వార్తలపై సబ్ కలెక్టర్ పవార్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం సింగన్నవలస వద్ద గల బంక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని యజమానులను హెచ్చరించారు.
కోనసీమ: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా డీఐఈవో చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఈ నెల 27తో ముగిసిన గడువును బోర్డు కమిషనర్ చివరిసారిగా పొడిగించారని, ఇకపై గడువు పెంచబోమని స్పష్టం చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు తమ కాలేజీల ద్వారా వెంటనే ఫీజు చెల్లించాలని ఆయన సూచించారు.
ELR: పోతిరెడ్డి పల్లి గ్రామంలో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ, ఇతర నేరాలపై ఇవాళ ప్రజలకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, అటువంటి పనులకు పాల్పడే తల్లిదండ్రులు, ఇతరులపై కేసులు నమోదు చేస్తామన్నారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రకాశం: మర్రిపూడి మండలం అయ్యవారిపాలెం గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి అయ్యవారిపాలెం గ్రామానికి చెందిన కొండప నాయుడు అనే వ్యక్తి మృతి చెందాడు. దెబ్బతిన్న రోడ్డు వల్లే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
NDL: డోన్ పట్టణంలోని పెట్రోల్ బంక్ ఎదుట ఇవాళ సీపీఐ జిల్లా కార్యదర్శి రంగం నాయుడు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గత మూడు రోజుల నుంచి పెట్రోల్ బంకులలో ఇంధనం లేకపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధముగా చర్యలు తీసుకోవాలని వారు అన్నారు.