NDL: అమరావతిలోని సచివాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రుల సమావేశం నిర్వహించారు. సహచర మంత్రులతో పాటు బనగానపల్లె ఎమ్మెల్యే, రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. 16వ పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో పలు కీలక విషయాలు చర్చించారు.
అన్నమయ్య: YCP జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి పేరుతో భారీ అవినీతి జరుగుతోందని, సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదని అన్నారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థ దెబ్బతిందని, అభివృద్ధి కేవలం ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు. మావిగన్ ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు.
VSP: డబ్లింగ్, విద్యుదీకరణ పనుల కారణంగా సికింద్రాబాద్–ధోన్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. విశాఖ-మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 10 నుంచి 17 వరకు జడ్చర్ల వరకే నడుస్తుంది. అలాగే మహబూబ్‌నగర్–విశాఖ ఎక్స్‌ప్రెస్ ఈనెల 11 నుంచి 18 వరకు జడ్చర్ల నుంచే ప్రారంభమవుతుంది.
సత్యసాయి: పెనుకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెనుకొండ శాఖ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు అందజేశారు. విద్యార్థుల్లో క్రీడా ప్రోత్సాహం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యులు రాఘవయ్య బ్యాంకు మేనేజర్ మహేష్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించారు.
E.G: జలధార కార్యక్రమం సత్ఫలితాలు సాధించడంలో ఇరిగేషన్‌తో పాటు ఇతర కోర్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద జలధార కార్యక్రమంపై క్షేత్ర స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో జలధార–జలహారతి కార్యక్రమాలు భూగర్భ జలాల పెంపులో దిశానిర్దేశంగా నిలుస్తాయన్నారు.
WG: నరసాపురం మండలం పసలదీవిలో ఈ నెల 9న ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ ఏడీ పి. చంద్ర శేఖర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఏఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. శిబిరంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. ఈ అవకాశాన్ని రైతులు, గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
KRNL: హొళగుంద మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విజయలలిత ఆధ్వర్యంలో సర్పంచుల సన్మాన సభ ఇవాళ నిర్వహించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేసిన సర్పంచులను శాలువాలతో సత్కరించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో వారి పాత్ర కీలకమని ఎంపీడీవో కొనియాడారు. సర్పంచుల సేవలను గుర్తించి ఈ సన్మానం నిర్వహించినట్లు తెలిపారు.
AKP: క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించడం అమానుషం అని సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం అచ్యుతాపురంలో క్యూబాకి మద్దతుగా విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న క్యూబా దేశాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
KDP: కమలాపురం 134వ నంబర్ రైల్వే గేటు వద్ద అత్యవసర ట్రాక్ మరమ్మతు పనుల కారణంగా, ఏప్రిల్ 9 నుంచి 14వ తేదీ వరకు గేటును మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మూసివేత కేవలం రాత్రి 10:00 నుంచి ఉదయం 5:00 గంటల వరకు మాత్రమే అమలులో ఉంటుందని తెలిపారు. ప్రజల భద్రత కోసం చేపడుతున్న ఈ పనులకు అందరూ సహకరించాలని అధికారులు కోరారు.
పోలవరం జిల్లాలోని 982 అంగన్వాడీ కేంద్రాల్లో రేపటి నుంచి 23వ తేదీ వరకు పోషణ్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. తల్లి, శిశు సంక్షేమం, పోషకాహారంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం అని జిల్లా మాతా శిశు సంక్షేమ శాఖ పీడీ ఉమ మంగళవారం తెలిపారు. జిల్లాలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు.
SKLM: ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో అధికారుల ఉత్తర్వులు మేరకు ఎస్సై హరికృష్ణ రావు సిబ్బందితో కలిసి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు మత్స్యకారులు వేటకు వెళ్ళేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, మహిళలపై జరుగుచున్న నేరాలు గురించి అవగాహన కల్పించారు. అలాగే, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
E.G: మాజీ సీఎం జగన్ సూచించిన ‘మావిగన్’ రాజధాని ప్రణాళిక అద్భుతమైనదని, కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి సంజీవిని లాంటిదని రాజమండ్రి రూరల్ మాజీ YCP కోఆర్డినేటర్ గిరజాల బాబు అన్నారు. మంగళవారం కడియంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలాగా జనాన్ని మభ్య పెట్టకుండా జగన్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నిజాయితీ ఉన్న నాయకుడు అన్నారు.
ప్రకాశం: దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామంలో చెరువులు, కాలువల పునరుద్ధరణ పనులను యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో భాగంగా చెరువుల అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
BPT: తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన రాజు అనే బాలుడు వేటపాలెంలో ప్రత్యక్షమయ్యాడు. వేటపాలెంకు చెందిన బాలగోపి అనే వ్యక్తికి రాజు రైల్వే స్టేషన్‌లో తారసపడి అన్నం పెట్టించమని అడిగాడు. అన్నం పెట్టిన తదుపరి రాజును వేటపాలెం ఎస్సై జనార్ధన్‌కు మంగళవారం అప్పగించాడు. రాజును ఆరా తీయగా తన తండ్రితో మంచిర్యాలలో ఉంటాడని చెప్పడంతో ఎస్సై అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
W.G: ఆచంట మండలం కొడమంచిలి పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన సోమేశ్వరరావును మంగళవారం కూటమి నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను ఆయనకు వివరించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపాలని నాయకులు కోరారు. స్పందించిన అధికారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.