SKLM: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అసత్యమని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి బుధవారం తెలిపారు. ప్రజలు ఇటువంటి వదంతులను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.
ATP: తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. విజయవాడలో జరిగిన నూతన జాతీయ, రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి తోటి ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె హాజరయ్యారు. నూతన కమిటీతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు.
KDP: ఒంటిమిట్ట మండలంలో జరుగుతున్న రీసర్వే పనులను జిల్లా ఆర్డీవో ఎ.మురళి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇవాళ మండలంలోని మంటపంపల్లి గ్రామ పొలాల్లో జరుగుతున్న రీసర్వే పనులను ఆయన తనిఖీ చేసి, సర్వేయర్లకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. రీసర్వే పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని, హద్దులను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.
BPT: కర్లపాలెం మండలంలో రెండు రోజులుగా జరుగుతున్న పారిశుధ్య శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని ఆయన సూచించారు. మరుగుదొడ్లు లేని వారు తక్షణమే ఈ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.
AKP: రహదారుల పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని నక్కపల్లి శివారు ప్రాంతంలో నిర్వహించినట్లు ఎంపీడీవో చలపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు రహదారిని శుభ్రం చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు.
KRNL: ఆదోని డివిజన్లో రీ-సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని జేసి నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వివిధ దశల్లో కొనసాగుతున్న రీసర్వే పనులను సమయపాలనతో పూర్తి చేయాలని సూచించారు. రైతుల భాగస్వామ్యంతో గ్రౌండ్ ట్రూతింగ్ నిర్వహించాలన్నారు.
CTR: టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం వరకు పుంగనూరులో మొదటి రకం 10KGల బాక్స్ రూ.300 పలికింది. బుధవారం అదే బాక్స్ గరిష్ఠంగా రూ.234కు చేరింది. కనిష్ఠంగా రూ.140 చొప్పున రైతుల నుంచి వ్యాపారులు కొనుకున్నారు. మార్కెట్ యార్డులో 466.40 మెట్రిక్ టన్నుల కాయలను వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు.
అన్నమయ్య: వేసవిలో సంభవించే ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ తెలిపారు. మదనపల్లె మండలం, నక్కలదిన్నె అంగన్వాడీ కేంద్రంలో ప్రజలకు వేసవిలో సంభవించే ఆరోగ్య సమస్యలు వడదెబ్బ, వడగాలులు, పాము కాటు, ఇతర విషపురుగులు, ఈతకు వెళ్లి మునిగి పోవుట వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
ATP: తాడిపత్రి పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఒక గుజరీ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లోపల ఉన్న సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
NTR: నందిగామలో ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ASR: ఉపాధి హామీ కూలీల సమస్యలపై జాయింట్ కలెక్టర్కు అరకులోయ వైసీపీ నేతలు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఫేషియల్ అటెండెన్స్ విధానం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా హాజరు నమోదు కాక వేతనాలు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. దీంతో కూలీల జీవనోపాధిపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండలం చినవంకదార గ్రామంలో ఇవాళ 104 వైద్య శిబిరం నిర్వహించారు. డా. జే. దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులకు పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఎండల నేపథ్యంలో ఓఆర్ఎస్ వినియోగం, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
విశాఖపట్నంలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం కల్పించిన రాయితీలకు గురువారం (ఏప్రిల్ 30) చివరి రోజు అని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 31, 2026 వరకు ఉన్న బకాయిలపై 50% వడ్డీ మాఫీ, 2026-27 పన్నుపై 5% రిబేట్ లభిస్తాయని చెప్పారు. జీవీఎంసీ సౌకర్య కేంద్రాలు రాత్రి 10 గంటల వరకు పనిచేస్తాయని వెల్లడించారు.
CTR: మాజీ మంత్రి రోజా ‘X’ వేదికగా CM చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ‘ప్రజలు గంటల తరబడి బంకుల ముందు నిలబడుతుంటే, రాజధాని కాంట్రాక్టర్లకు రిటైల్ ధరకే 2.75 కోట్ల లీటర్ల డీజిల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించడం ఆశ్చర్యంగా ఉంది @ncbn గారూ?. మిగతా ప్రాంతాల ప్రజల కష్టాలు మీకు కనిపించడం లేదా?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఆమె సోషల్ మీడియాలో నిలదీశారు.
TPT: తిరుపతి నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తను వందశాతం నిర్వహణ చేయాలని ఇంఛార్జ్ కమిషనర్ శారదా దేవి అధికారులకు సూచించారు. పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను పరిశీలించారు. కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం వల్ల మురుగునీరు నిలిచిపోతుందని హెచ్చరించారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరుగా ఇవ్వాలన్నారు.