PPM: వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రక్తదానం మహాదానమని, ప్రజలు రక్తదానం పట్ల ఉన్న అపోహలను వీడి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనం ఇచ్చే రక్తం మరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తుందని గుర్తు చేశారు.
SKLM: ఉపాధి హామీ పనుల్లో ఫేస్ యాప్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. హిరమండలం మండలం గుళుమూరులో శుక్రవారం ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ప్రవేశపెట్టిన ఈపద్ధతి వలన కొంతమందికి హాజరుపడక ఇబ్బంది పడుతున్నారని, దీనివలన వేతనం నష్టపోతున్నారన్నారు.
ATP: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. ఈ భేటీలో ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
CTR: రేణిగుంట పట్టణంలోకి వచ్చే ప్రధాన మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జిని ఈనెల 13వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు మూసివేస్తామని అధికారులు ప్రకటించారు. అత్యవసర మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టూ వీలర్లు, త్రీ వీలర్లు సంత గేటు మార్గంలో, ఫోర్ వీలర్లు, భారీ వాహనాలు నారాయణాద్రి ఆసుపత్రి మీదుగా వెళ్లాలని సూచించారు.
కోనసీమ: రావులపాలెంలోని శ్రీ సత్యసాయి సేవా కేంద్రం నందు శుక్రవారం నుండి ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టెన్త్ పాస్ అయిన అభ్యర్థులకు కంప్యూటర్ డీసీఏ కోర్సు ఉచితంగా నేర్పబడునని పేర్కొన్నారు. శిక్షణ పొందేవారు శుక్రవారం నుండి జరిగే శిక్షణలో పాల్గొని పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
విశాఖ ఆర్టీసీ ఇన్ గేట్ జంక్షన్ వద్ద అంబేద్కర్ 135వ జయంతి ప్రచారంలో భాగంగా కరపత్రాలను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఏప్రిల్ 14న జరిగే ర్యాలీలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అన్నమయ్య: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) అన్నమయ్య జిల్లా రాయచోటి తాలూకా కమిటీ ఎన్నికలు నేడు రాయచోటి ఏరియా హాస్పిటల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో సాయికుమార్ తాలూకా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా రవీంద్ర, ట్రెజరర్‌గా వెంకటేష్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ ఎన్నికైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
NDL: మహానంది మండలం తిమ్మాపురం మోడల్ స్కూల్లో ఈ నెల 12న జరగనున్న ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శుక్రవారం ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు. ఉ.10 గంటల నుంచి మ. 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష రాసే విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. నిబంధనల మేరకు పరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు.
VZM: రాష్ట్ర రాజధాని అమరావతి కాదు కమ్మరావతి అని ప్రజలు చర్చించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. ఈ మేరకు గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. రాజధాని నిర్మాణంపై ప్రజలు మేధావులు చర్చించుకోవలసిన అవసరం ఉందన్నారు. అలాగే, ప్రభుత్వం సాధ్యమైన పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారని పేర్కొన్నారు.
PPM: పూర్ణపాడు-లాభేసు వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ సీపీఎం నాయకులు శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. జిల్లా కమిటీ సభ్యుడు సాంబమూర్తి గాజులగూడలో మోకాళ్లపై నడుస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వంతెన పూర్తైతే సుమారు 40 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. “సీఎం సాయి కాంత్ వర్మ IAS” పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ఖాతా అసలు అధికారికది కాదని అధికారులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ “District Collector Guntur” మాత్రమేనని వెల్లడించారు. ప్రజలు నకిలీ అకౌంట్‌లను నమ్మి మోసపోవద్దన్నారు.
ATP: అనంతపురం నగరంలో పన్నుల చెల్లింపునకు ప్రజలకు అనువుగా ఐదు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు తెలిపారు. 2026- 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను, ఇంటి ఖాళీ స్థలం పన్ను ఏక మొత్తంలో చెల్లించే వారికి 5 శాతం రాయితి పొందవచ్చు అన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
TPT: తిరుచానూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పట్టాలపై వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. రైలు నుంచి జారి పడ్డాడా? ఆత్మహత్యకు ప్రయత్నించాడా? అనేది తెలియాల్సి ఉంది. శుక్రవారం తెల్లవారుజామున ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి సంబంధించిన సమాచారం తెలిస్తే తమకు తెలపాలని రైల్వే పోలీసులు కోరారు.
KRNL: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ శుక్రవారం నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలు నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నా, సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదన్నారు.
కోనసీమ: కాట్రేనికోన మండలం పెనుమళ్ల పంచాయితీ కార్యాలయాన్ని ఎంపీడీవో రాజేశ్వర్ రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బంది హాజరు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పౌర సేవలు వేగంగా అందించాలని సూచించారు. సేవలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు.