W.G: తాడేపల్లిగూడెం వ్యాపారపరంగా అత్యంత చైతన్యవంతమైన ప్రాంతమని కలెక్టర్ నాగరాణి కొనియాడారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని, గూగుల్ డేటా సెంటర్ స్థాపనే అందుకు నిదర్శనమని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ పరిశ్రమల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ పాల్గొన్నారు.
PPM: సాలూరు నియోజకవర్గాన్ని రూ. 490 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్‌లో నిధులు కేటాయించారని ఆమె గుర్తుచేశారు. ఆ నిధులతో నియోజకవర్గంలోని మొత్తం పనులను చేసుకుంటూ ముందుకు వెళతామని పేర్కొన్నారు.
KDP: జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఏప్రిల్ 08, 09 తేదీలలో కడప సర్వజన ఆసుపత్రి ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రక్త పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షల కోసం ఖాళీ కడుపుతో రావాలని, గత వైద్య పరీక్షల నివేదికలు ఉంటే తీసుకురావాలని సూచించారు.
AKP: ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌లో ప్రభుత్వం నెట్ జీరో హెల్త్ క్యాంపస్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి కేజీబీవీ ప్రిన్సిపల్స్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో వ్యర్ధాల నిర్వహణను మెరుగుపరచడం వ్యర్ధాలు లేకుండా చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు.
సత్యసాయి: పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పల్లె సింధూరను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కలిసి తమ సమస్యలను వివరించారు. కొన్ని ఏళ్లుగా పని చేస్తున్న ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. తమ సేవలకు గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే వారి సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
SKLM: ఆరోగ్యమే నిజమైన సంపద అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.అనిత అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకొంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతారన్నారు. ప్రతీ ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలన్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని DMHO కార్యాలయం నుంచి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేశారు.
ప్రకాశం: పెద్దారవీడు మండలం రామాయపాలెం గ్రామంలో రైతులు సంబంధించిన గడ్డివాములు మంగళవారం దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన గొల్ల రాజారావు మురారి వెంకటయ్యలకు చెందిన గడ్డివాములు అగ్ని ప్రమాదంతో పూర్తిగా దగ్ధమయ్యయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదాలకు గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
VZM: ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
సత్యసాయి: జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మంగళవారం గుడిబండ మండలం కరికెర గ్రామంలో పర్యటించారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లాలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన ‘భర్తన్ బ్యాంక్’ (స్టీల్ సామాన్ల బ్యాంకు)ను ఆయన ప్రారంభించారు. కరికెర మహిళల ఐక్యత, పనితీరు జిల్లాకే ఆదర్శమని కలెక్టర్ కొనియాడారు. DRDA పీడీ నరసయ్య, DPO సమత పాల్గొన్నారు.
KRNL: ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంపై పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ జేఈ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు సత్యన్న గౌడ్, టీడీపీ నాయకులు ముక్కన్న, మునెప్ప, గ్రామ అధ్యక్షుడు బోయ యంకన్న తదితరులు పాల్గొన్నారు.
TPT: ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. తోటి పిల్లలతో ఆడుకుంటూ కాలుజారి చెరువులోని జేసీబీ గుంతలో పడి ఎండ్ల సుస్మిత(6) మృతి చెందింది. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
VZM: హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తీవ్రంగా ఖండించారు. అమరావతిపై వారి అధినాయకుని నిర్ణయాన్ని ఎత్తిచూపినందుకు మీడియాపై వైసీపీ దాడి చేయడం సబబు కాదని హితవు పలికారు. ఆంధ్రజ్యోతికథనంపై అభ్యంతరం ఉంటే ఖండన ఇవ్వాలి తప్ప, ఇలా భౌతిక దాడులు సరికాదన్నారు.
ATP: రాప్తాడు నియోజకవర్గ కేంద్రం నుంచి చిన్మయ నగర్, జేఎన్టీయూ రహదారిలోని పండమేరు వాగుపై లో-లెవెల్ కాజ్ వే నిర్మాణానికి ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం భూమిపూజ చేశారు. రూ.4 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులకు తొలి దశలో రూ.2 కోట్ల డీ.ఎం.ఎఫ్ నిధులు మంజూరయ్యాయి. అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆమె పనులు ప్రారంభించారు.
TPT: SPMVV పరిశోధన విద్యార్థిని పీ.జ్యోతికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. ఎస్. జోష్న రాణి మార్గదర్శకత్వంలో, టైప్-2 మధుమేహం ఉన్న ప్రీమెనోపాజల్, పోస్టుమెనోపాజల్ మహిళల్లో నిద్ర సమస్యలపై ఆమె పరిశోధన చేశారు. ఆమెకు డాక్టరేట్ లభించడంతో పలువురు అభినందనలు తెలిపారు.
KDP: జమ్మలమడుగులో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై మాజీ సీఎం YS జగన్‌తో వైసీపీ నేతలు చర్చించారు. మంగళవారం తాడేపల్లిలోని YS జగన్ స్వగృహం నందు మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు వల్లంబాయి హృషికేశవ రెడ్డి, సీనియర్ నాయకులు సింగంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి కలిశారు. వైసీపీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జగన్ సూచించినట్లు హృషికేశవ రెడ్డి తెలిపారు.