అనకాపల్లి: మండల కేంద్రమైన ఎస్. రాయవరంలో రూ.1.5 కోట్లతో నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయం ఇవాళ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా రెండు రోజులు నుంచి ఆలయంలో పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప స్వామి విగ్రహంతో పాటు పలు దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. శనివారం సాయంత్రం విగ్రహాలకు కలశాలకు పాలు, తేనె, పెరుగు, పంచదార తదితర వాటితో అభిషేకాలు చేశారు.
VZM: యువత చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని బొబ్బిలి CI కె.నారాయణరావు సూచించారు. శనివారం సాయంత్రం స్దానిక కోమటిపల్లిలో అభ్యుదయం 2.0 నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెడు వ్యసనాలకు లోనైతే జీవితాలు నాశనం అవుతాయన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు, ATM, అధార్, OTP వివరాలు చెప్పవద్దన్నారు.
BPT: పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు ఎస్సై పులి గోపి శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండాలని, శాంతి భద్రతలకు సహకరించాలని సూచించారు. చట్టవిరుద్ధ పనుల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో మంచి పౌరులుగా మారి జీవనోపాధిపై దృష్టి పెట్టాలని తెలిపారు. పోలీసులు పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం ఆయన చేశారు.
మన్యం: జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి శనివారం సీతానగరం మండలంలో పర్యటించారు. ఇందులో భాగంగా పెద్ద భోగిల్లి గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి, అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆనంతరం సిబ్బంది హాజరు పట్టిక, వారి కదలిక రిజిస్ట్రార్‌ను నిశితంగా పరిశీలించారు. సచివాలయ సిబ్బంది సకాలంలో కార్యాలయానికి చేరుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు భీమవరం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ తెలిపారు. వరి కోతలు, ఆక్వా సాగు యంత్రాలు, రవాణా వాహనాలకు ఇంధన కొరత లేకుండా చూసేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు ఎదురైతే ప్రజలు వెంటనే 8121676653 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
CTR: యాదమరి మండలం సంతగేటు గ్రామంలో అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. ఎస్సై ఈశ్వర్, డీటీ జయంతి, ఆర్‌ఐ ప్రసాద్ నిర్వహించిన ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 9 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న అబ్దుల్ సలాంను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
కోనసీమ జిల్లాలో కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల ద్వారా తలసరి ఆదాయం తెలుపుతూ పలు ప్రతిపాదనను రూపొందించామని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్‌లో శనివారం సమావేశంలో మాట్లాడారు. బాలయోగి స్టేడియం అభివృద్ధికి రూ.30 కోట్లతో ప్రతిపాదనలు చేశామన్నారు. అభివృద్ధికి రూ.1 కోటి కేటాయించామన్నారు. రూ.1,650 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం మంజూరు అయ్యిందన్నారు.
E.G: ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపులపై రాయితీ పొందేందుకు మరో ఐదు రోజులే గడువు ఉందని కమిషనర్ రాహుల్ మీనా శనివారం తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సర పన్నును ఈ నెల 30లోపు ఏకమొత్తంగా చెల్లించే వారికి 5 శాతం రాయితీతో పాటు, పాత బకాయిల వడ్డీపై 50 శాతం మినహాయింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ATP: తాడిపత్రి డిపో నుంచి కర్నూలు వెళ్లే ఆర్టీసీ బస్సులను నేటి నుంచి యాడికి మీదుగా నడుపుతున్నట్లు టీఐ పుల్లయ్య తెలిపారు. గతంలో బస్సులు బైపాస్ మీదుగా వెళ్లడం వల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను స్థానికులు CM చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విన్నపంపై స్పందించిన అధికారులు యాడికి మీదుగా సర్వీసులను పునరుద్ధరించారు.
NLR: సీతారామపురం మండలం బోడసిద్దయ్య పల్లిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వెంకటేశ్వర్లును శనివారం స్పెషల్ స్క్వాడ్ పోలీసులు పట్టుకొని ఉదయగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు ఉదయగిరి ఎక్సైజ్ ఎస్సై దీప్తి కారంత్ తెలిపారు. తన దుకాణంలో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గుంటూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు. గృహ నిర్మాణాల పురోగతిపై నిన్న సమీక్ష నిర్వహించిన ఆయన, ఇంజనీర్లు, గుత్తేదారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
KDP: కొండాపురంలో ఓ కంటి ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్యశిబిరం ఆదివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు చేస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
BPT: కర్లపాలెం మండలం పేరలిపాడు గ్రామంలో శనివారం ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. నాటక ప్రదర్శన ఏర్పాట్ల సమయంలో స్టేజి కిందుగా వెళ్తున్న జోగి లిబ్నిరాజుకు విద్యుత్ తీగలు తగిలాయి. తీవ్రంగా అస్వస్థతకు గురైన అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనకాపల్లి: వేసవిలో పాయకరావుపేట నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న మంత్రి శనివారం సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. తాగునీటి సమస్య ఎక్కడైనా ఏర్పడితే వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.