NTR: తిరువూరు పట్టణంలో జరుగుతున్న పరిశుభ్రత పనులను మున్సిపల్ కమిషనర్ కె.మనోజ బుధవారం ఉదయం పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరును సమీక్షిస్తూ చెత్తను సమయానికి తరలించాలని, వీధులు శుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
NLR: మర్రిపాడు మండలం నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై చుంచులూరు క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా చికెన్ వ్యర్ధాలను తరలిస్తున్న ఓ మినీ ట్రక్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. వాహనంలో ఉన్న చికెన్ వ్యర్ధాలను రెవెన్యూ సిబ్బందితో కలిసి పూడ్చిపెట్టారు.
VZM: తెర్లాం మండలం పెరుమాలి గ్రామానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు పాకలపాటి సాంబశివరాజు మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా మృతి చెందారు. ఈయన 2005 -10 మద్య మానసాస్ ట్రస్ట్‌కు కరస్పాండెంట్‌గా కూడా వ్యవహరించారు. రెండు సార్లు కోపరేటివ్ బ్యాంకు ప్రెసిడెంట్‌గా పని చేశారు. ఈయన అకాల మృతికి పలువురు నాయకులు, గ్రామస్థులు సంతాపం తెలిపారు.
AKP: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. ఉపాధ్యాయులు రోజుకు రెండు గంటలు ఎన్‌రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వివరిస్తున్నారన్నారు.
Vsp: గాజువాకలో ప్రియురాలు మౌనికను హత్య చేసిన నేవీ ఉద్యోగి చింతాడ రవీంద్రను పోలీసులు మంగళవారం రాత్రి కస్టడీలోకి తీసుకున్నారు. గత నెల 29న జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు గాజువాక పోలీసులు కోర్టును ఆశ్రయించగా, నిందితుడికి మూడు రోజుల కస్టడీ మంజూరైంది. ఈ విచారణలో హత్యకు సంబంధించిన మరిన్ని విషయాలను వెలికితీయనున్నారు.
PPM: రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంద్యారాణి మంగళవారం సాలూరులో 7 కొత్త పైలట్ వాటర్ స్కీమ్‌లను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఈ స్కీమ్ ప్రారంబించామని, స్దానిక 2, 3,5,6,7,19 వార్డుల్లో ఈ స్కీమ్స్‌ను అమలు చేశామన్నారు. ఒక్కో స్కీమ్‌కు రూ.1.80 లక్షల వ్యయం కాగా, మొత్తం 12.60 లక్షలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.
అన్నమయ్య: రైల్వే కోడూరు మండలంలోని విద్యానగర్‌లో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పాములేటి వెంకటరమణమ్మ ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ఇంట్లోని సామాగ్రి అంతా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో ప్రమాదం పక్క ఇళ్లకు వ్యాపించకుండా నివారించగలిగారు.
సత్యసాయి: పెనుకొండ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పంచాయతీల ప్రత్యేక అధికారులతో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతులపై దృష్టి సారించాలని సూచించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి కొరత రాకుండా చూడాలని అన్నారు.
TPT: తిరుపతిలోని జేపీ జువెలరీలో మార్చి 23న బంగారు గొలుసు దొంగతనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 4 లక్షల విలువైన బంగారు గొలుసుతో పాటు రూ.80 వేల విలువైన సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన వెస్ట్ పోలీసులు అచ్యుతరాయ రోడ్డులో నిందితుడిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.
KRNL: ఆదోని పట్టణంలో ఏప్రిల్ 13న నూతనంగా ప్రారంభం కానున్న ఆంధ్రా గోల్డ్ అండ్ జ్యూవెలరీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటుడు అలీ తన సతీమణితో కలిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వారి రాక నేపథ్యంలో అభిమానులు, వ్యాపార వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
ATP: రాయదుర్గం ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించడమే ప్రాధాన్యతని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. రూ.72.32 కోట్లతో అమృత్-2 పథకం కింద 70 వేల మందికి ఉపయోగపడే పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
PPM: జిల్లా కేంద్రంలో ఈ నెల 22న నిర్వహించనున్న భారీ సాంస్కృతిక ప్రదర్శనతో సరికొత్త రికార్డు సృష్టించాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి ఆకాంక్షించారు. పట్టణంలో సుమారు 6 వేల మంది విద్యార్థులతో ఈ ప్రదర్శనను చేపట్టనున్నారు. దీనికి సంబంధించి మంగళవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో VC నిర్వహించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
NLR: నెల్లూరు జిల్లాలో పరిపాలనా కారణాలతో 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాపూరు, చేజర్ల, సైదాపురం, కండలేరు ఎస్సైలతో పాటు వీఆర్‌లో ఉన్న నలుగురు అధికారులకు కొత్త పోస్టింగ్లు ఇచ్చారు. బదిలీ అయిన ఎస్సైలందరూ తక్షణమే విధుల్లో చేరాలని ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
AKP: సబ్బవరం మండలం గొల్లలపాలెం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పంచాయతీ స్వీపర్ కొమ్ము దుర్గాలు (65) దుర్మరణం చెందాడు. ఇంటి నుంచి గొల్లల పాలెం పంచాయితీ కార్యాలయానికి బైక్ పై వెనక కూర్చుని వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దుర్గాలు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
VSP: ఏయూ శతాబ్ది ఉత్సవాల మెగా కల్చరల్ ఫెస్ట్ మంగళవారం రాత్రి అట్టహాసంగా జరిగాయి. ఎంపీ ఎం. శ్రీభరత్, సినీ నటుడు శివాజి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఏయూను ప్రపంచ స్థాయి వర్సిటీగా తీర్చిదిద్దాలని శ్రీభరత్ ఆకాంక్షించగా, యువత ఒత్తిడి లేకుండా లక్ష్యాల దిశగా సాగాలని శివాజీ సూచించారు.