KRNL: కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులు దెబ్బతిన్నాయని ఎమ్మిగనూరులో ఇవాళ సీఐటీయూ నాయకులు విమర్శించారు. 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10-12 గంటల పని వేళలు అమలు చేయడం దోపిడీకి దారితీస్తుందని తెలిపారు. మహిళలను రాత్రి షిఫ్టుల్లో పనిచేయించే చట్టాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ASR: పాడేరు వైద్య కళాశాల ఆవరణలో శనివారం వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. జిల్లాలో రక్తపు నిలువలు పెంచేందుకు, ప్రాణాపాయంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు వైద్య విద్యార్థులు రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకమని పలువురు వర్షం వ్యక్తం చేశారు. ప్రధానాచార్యులు డా. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రక్తదానం ఒక అలవాటుగా తీసుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
VZM: కొత్తవలస-విజయనగరం ప్రధాన రహదారి డా. బెల్లాల రామారావు హాస్పిటల్ నుంచి అన్న క్యాంటీన్ వరకు వెళ్ళే మురుగుకాలువ చెత్తతో పేరుకుపోయి రోడ్డుమీద ప్రవహిస్తుందని శుక్రవారం HIT TVలో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. వార్తకు స్పందించి పంచాయతీ సిబ్బంది శనివారం కాలువలో పేరుకుపోయిన చెత్తను తీసి మురుగునీరు వెళ్ళేలా చేశారు. దీంతో దుకాణదారులు హర్షం వ్యక్తం చేశారు.
AKP: చోడవరం పట్టణంలోని ఎడ్లవీధి అంగన్వాడీ కేంద్రంలో శనివారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ గోవాడ వరలక్ష్మీ మాట్లాడుతూ.. తల్లులు తమ పిల్లలకు పోషక విలువలు గల ఆహారం అందించాలని చెప్పారు. పిల్లలతో సమయాన్ని గడపడం వల్ల వారి మెదడు ఉత్తేజంగా పని చేస్తుందన్నారు. సెల్ ఫోన్లను పిల్లలకు దూరంగా ఉంచాలని సూచించారు.
PLD: క్రోసూరు మండల కేంద్రంలో సీపీఐ నిరసన కార్యక్రమం చేపట్టారు. అర్హులైన పేదలకు నివేశ స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలకు 50 సంవత్సరాలకే పింఛన్ అందించాలని కోరారు. కార్మికులకు, కర్షకులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ASR: సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పునాదులు వేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని కలెక్టర్ నిషాంతి కొనియాడారు. శనివారం పాడేరులో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యా ప్రాముఖ్యతకు, కుల వివక్షకు వ్యతిరేకంగా పూలే చేసిన పోరాటం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు.
GNTR: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ATP: గుత్తి మున్సిపాలిటీలోని పలు వార్డులో శనివారం జనగణనపై ప్రజలకు క్షేత్రస్థాయిలో కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పరిశీలించారు. ఇంటింటికి తిరుగుతూ జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరించి, వివరాలు నమోదు చేసి ఇంట్లో జాబితా రూపొందిస్తున్నారని వివరించారు.
BPT: కొరిసపాడు మండలంలోని మేదరమెట్టలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సదరు వ్యక్తిని వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. తీవ్ర రక్తస్రావమై, క్షతగాత్రుడు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AKP: గొలుగొండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శనివారం గ్రామంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమణమూర్తి, సహాయ ఉపాధ్యాయులు విజయలక్ష్మి, స్కూల్ కమిటీ ఛైర్మన్ వెంకటరమణ పాల్గొన్నారు. గ్రామంలో విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ తల్లిదండ్రులను తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరారు.
W.G: తాడేపల్లిగూడెంలో తాటి ముంజెలకు భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా పశ్చిమలో ముంజెలకు మే మొదటి వారంలో మార్కెట్కు అమ్మకానికి వస్తాయి. కానీ ఈ ఏడాది నెల రోజుల ముందు గానే తాటి మంజులు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అయితే వీటి ధర అదరహో అన్నట్లుగా ఉంది. డజను ముంజెలు రూ.80 వరకు పలుకుతున్నాయి. అయినా వీటిని కొనేందుకు వినియోగదారులు ఎగబడుతున్నారు.
VSP: గాజువాక 75వ వార్డ్ చిన కోరాడ SC కాలనీలో ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ SC/ST యోజన’ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ పథకం ఎంతో ఉపయోగకరమని, అందరూ వినియోగించుకోవాలని సూచించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుందని తెలిపారు. పెద గంట్యాడ మండలంలో సుమారు 350 మంది అర్హులుగా ఉన్నారని ఆయన వెల్లడించారు.
KRNL: ఆస్పరి మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఇవాళ MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు వారాలకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి రిజర్వాయర్ నిర్మాణం లేదా హంద్రీ నీవా కాల్వ నీటిని తరలించాలని డిమాండ్ చేశారు.
CTR: వెదురుకుప్పం మండలంలోని రైతు భరోసా కేంద్రంలో హార్టికల్చర్ అధికారి లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో మామిడి కవర్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు మోహన్ మురళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవర్ ధరలో ప్రభుత్వం ఒక రూపాయి సబ్సిడీ అందిస్తుందని, రైతులు ఒక్క రూపాయి చెల్లించి కవర్లు పొందవచ్చని తెలిపారు.
KDP: ఓబులవారిపల్లి మండలం పెద్ద ఓరంపాడు పంచాయతీ బెస్తపల్లి గ్రామంలో వ్యవసాయ నష్టంతో సారా సురేష్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంటలు విఫలమవడంతో అప్పుల భారంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న అతను పొలంలో పురుగుల మందు సేవించాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.