మంత్రి అంబటి రాంబాబు బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, కాపుల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు జనసేనాని ఊడిగం చేస్తున్నారన్న ఆయన, అతని వెంట వెళ్లి ఊడిగం చేయండని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ కలిసి కాపులను మోసం చేస్తున్నారని, పవన్ బుద్ధి, జ్ఞానం లేని రాజకీయాలు చేస్తున్నాడన్నారు. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటాడని ప్రశ్నించారు.
చంద్రబాబుకు పవన్ ఊడిగం చేస్తున్నారని, అలాంటి పవన్ వద్ద ఉంటారో, జగన్‌ను నమ్ముకున్న అంబటి రాంబాబు వెంట ఉంటారో తేల్చుకోండి అన్నారు. పవన్‌తో కలిసి వెళ్లే కాపులంతా అతనితో కలిసి ఊడిగం చేయండి అన్నారు. వైసీపీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రానివ్వనని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని అంటున్నాడని, అతను ఏమైనా అంత పెద్ద మగాడా అని నిలదీశారు. వైసీపీలో తాను విమర్శించినంత ఘాటుగా ఎవరూ విమర్శించరని, అందుకే తనను టార్గెట్ చేసుకొని, పవన్ ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాపులను చంద్రబాబు దొడ్లో కట్టేసే ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు.
కాపులు మా పవన్.. మా పవన్ అంటూ మాట్లాడుతున్నారని, అలాంటి వారు చంద్రబాబు దగ్గర వెట్టి చాకిరి చేయండి అన్నారు. రెండు చోట్ల పోటీ చేసి, ఒక్కచోట గెలవని పవన్ తనపై ఆరోపణలు చేస్తాడా, చంద్రబాబు కాళ్ల మీద పడి ఏడవమను అని ధ్వజమెత్తారు. నేను నికార్సుగా ఉంటే వ్యక్తిని అని, మీరు ఎవరితో ఉంటారో తేల్చుకోండి, నాకేం అభ్యంతరం లేదన్నారు. నేను నాటి నుండి వైయస్‌ను, ఆ తర్వాత జగన్‌ను నమ్ముకున్నానని చెప్పారు. మధ్యలో పుట్టి వదిలేసేవాడిని కాదన్నారు.