ఇటీవల.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కందుకూరులో నిర్వహించిన బహిరంగ సభ సమయంలో… తొక్కిసలాట జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా… ఈ ఘటన నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయితీ రాజ్ రోడ్లు, మున్సిపల్ రోడ్లపై సభలు, సమావేశాలను నిషేధిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. ప్రజలకు ఇబ్బందులు కల్గించకూడదన్న ఉద్దేశంతోనే ఈ జీవో జారీ చేశామని ప్రజలకు అసౌకర్యం కల్గని ప్రాంతాల్లో సభలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పైన రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ పిల్ విచారణ సమయంలో కీలక వాదనలు జరిగాయి. పిల్ ను విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ జీవో నెంబర్ 1 ను ఈ నెల 23వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ ఆదేశాలినిచ్చిన విషయం తెలిసిందే. కాగా నేడు జీవో నెంబర్1 పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. జీఓ నెంబర్ 1పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్పై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నేడు మరోమారు హైకోర్టు లో ఈ పిటిషన్ పై విచారణ జరుగనుంది.