»Rk Roja Sandals Tourist Employee Carried With Hand
RK Roja Sandals ఉద్యోగితో చెప్పులు మోయించిన మంత్రి రోజా
మంత్రిగా రోజా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆమె ఆగడాలు పెరిగిపోయాయని సమాచారం. పలుమార్లు అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు జరిగాయి. ఆమె తన తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో నగరి ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంది.
అధికారం ఉంది కదా దర్పం ప్రదర్శించే ప్రజాప్రతినిధులు ఎందరో ఉన్నారు. ఎంతో కష్టపడి, ఎన్నో ప్రయత్నాలు చేసి అధికారంలోకి వస్తారు. వచ్చాక పెత్తనం చెలాయించాలని చూస్తారు. అధికార మదంతో మనుషులను మనుషులుగా కూడా చూడరు. అందరూ తమ కిందే అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వైఖరి ప్రస్తుతం ఏపీ (Andhra Pradesh)లో అధికారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు వర్తిస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యర్థులను మట్టుబెట్టడం.. వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం జరుగుతోంది. అక్రమ కేసులు బనాయించడం.. గిట్టని వారిపై పోలీసులతో దాడులు చేయించడం.. వారిని గృహ నిర్బంధం చేయడం.. జైలు పాలు చేయడం.. బహిరంగ కార్యక్రమాలు నిర్వహించుకోకపోవడం వంటివి ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది.
ఈ కోవలోకే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ (AP Tourism) మంత్రి ఆర్కే రోజా (RK Roja) చెందుతారు. ఆమె అధికారం ఉంది కదా అని రెచ్చిపోతున్నారు. నగరి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఆమె పెత్తనం చెలాయిస్తున్నారు. ఆమె వైఖరి సొంత పార్టీలోనే చిచ్చు రేపుతున్నది. తన సొంత నియోజకవర్గం నగరిలో ఆమె తీరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలింది. రెండు వర్గాలుగా పార్టీ మారింది. ఆమె నగరిలో కన్నా తిరుమలలో ఎక్కువగా ఉంటున్నారు. నెలలో దాదాపు ఐదారు సార్లు తిరుమల ఆలయానికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసే హడావుడి అంతా ఇంతా కాదు.
ఇక ప్రస్తుతానికి రాజధానిగా కొనసాగుతున్న తాడేపల్లిలో రోజా మరింత రెచ్చిపోయారు. ఆమె అధికారిక పర్యటనలో ఓ ఉద్యోగితో తన పాదరక్షలు (Sandals) మోయించారు. ఆమె చేసిన ఈ చర్యతో రాష్ట్ర ప్రజానీకమంతా మండిపడుతున్నది. ఇంతకీ ఏం జరిగిందంటే.. గురువారం బాపట్ల జిల్లా (Bapatla District)లో రోజా పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని సూర్యలంక బీచ్ (Suryalanka Beach) ను సందర్శించారు. బీచ్ లో పర్యాటకులకు కల్పించాల్సిన వసతులు, ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు.
అనంతరం రోజా సముద్రపు నీటిలోకి వెళ్లారు. నీటిలోకి వెళ్లే ముందు ఆమె తన పాదరక్షలను వదిలేసింది. అయితే వాటిని ఓ ఉద్యోగి చేతికి ఇచ్చారు. ఆ పాదరక్షలు ఇస్తూ ఆమె పీఏ ‘మేడమ్ గారి చెప్పులు జాగ్రత్త’ అంటూ చెప్పి పర్యాటక శాఖ ఉద్యోగి నాగరాజుకు అప్పగించారు. ముందే మంత్రి కావడంతో ఆ ఉద్యోగి భయంతో రోజా పాదరక్షలు జాగ్రత్తగా పట్టుకుని ఉన్నాడు. మంత్రి రోజా సముద్రపు నీటిలో కొన్ని నిమిషాల పాటు గడిపి వచ్చారు. అక్కడ కళ్లద్దాలు వేసుకుని కొన్ని ఫొటోలకు కూడా ఫోజిచ్చారు. అప్పుడు ఆ ఉద్యోగి చెప్పులను భద్రంగా ఇచ్చాడు. పాదరక్షలు పట్టుకున్న విషయం తెలిసీ కూడా అయ్యో అని కూడా బాధపడకపోవడం గమనార్హం. మంత్రిగా రోజా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆమె ఆగడాలు పెరిగిపోయాయని సమాచారం. పలుమార్లు అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు జరిగాయి. ఆమె తన తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో నగరి ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంది.