1990లలో తెలుగు దేశం పార్టీలో లక్ష్మీ పార్వతి వ్యవహరించినట్లుగా ఇప్పుడు వైసీపీలో సజ్జల రామకృష్ణా రెడ్డి కనిపిస్తున్నారని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
1990లలో తెలుగు దేశం పార్టీలో (Telugu Desam) లక్ష్మీ పార్వతి (Laxmi Parvathi) వ్యవహరించినట్లుగా ఇప్పుడు వైసీపీలో (YCP) సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) కనిపిస్తున్నారని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గతంలో టీడీపీలో (TDP) తలెత్తిన సంక్షోభం వంటిది మన పార్టీలో జరగకుండా ముందే చూసుకోవాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి (Chief Minister of Andhra Pradesh, YS Jagan Mohan Reddy) సూచించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు మంచివారు అయినప్పటికీ, లక్ష్మీ పార్వతి ఎంట్రీతో.. పార్టీలో ఆమె ప్రమేయం ఎక్కువ కావడంతో 1995లో టీడీపీలో సంక్షోభం తలెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు సజ్జల కూడా నాటి టీడీపీలో లక్ష్మీపార్వతిలా వ్యవహరిస్తున్నారన్నారు. పరిస్థితులు చేయి దాటక ముందు ఆయనను పక్కన పెట్టకపోతే ఎక్కువ మందిలో అసంతృప్తి పెరుగుతుందని జగన్ ను హెచ్చరించారు. ఇప్పటికి కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, జగన్ పట్ల అభిమానంతో ఉన్నారని చెప్పారు. కానీ సజ్జల అతి జోక్యంతో ఇబ్బంది రావొచ్చునని అభిప్రాయపడ్డారు.
ఒకప్పటి సాక్షి దిన పత్రిక ఉద్యోగి సజ్జలకు ఎమ్మెల్యేలను రిపోర్ట్ చేయాలని చెప్పడం సరికాదన్నారు రఘురామ. ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేయలేదని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారని, అందులో వాస్తవం ఉందన్నారు. జగన్, వైసీపీ కోసం మేకపాటి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, వైసీపీ స్థాపించాలనుకున్నప్పటి నుండి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆ పార్టీకి అండగా ఉన్నారని గుర్తు చేశారు. జగన్ పార్టీ పెట్టాలనుకున్న సమయంలో మద్దతుగా మేకపాటి చంద్రశేఖర రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారన్నారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయమంగళ వెంకటరమణకు ఓటు వేసానని, అందుకే ఆయన గెలిచారని చంద్రశేఖర రెడ్డి చెబుతున్నప్పటికీ, అలాంటి వ్యక్తిని అంతర్గత నివేదికల ద్వారా సస్పెండ్ చేశామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు.