»Potti Shriramulu Who Sacrificed Their Life For Andhra Peoples This Is How Ap Came Into Being
Andhrapradesh: ఆంధ్రుల కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టిశ్రీరాములు..ఏపీ అవతరించిందిలా
నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. సరిగ్గా 2014 జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకల గురించి చాలా మంది పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది.
ఏపీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఏ రోజు జరుపుకోవాలని తెలియని పరిస్థితి విభజన తర్వాతి రోజుల్లో ఉండేది. ఆంధ్రా.. తెలంగాణ ప్రాంతంతో కలిసి విశాలాంధ్రప్రదేశ్గా మారిన రోజు జరుపుకోవాలో లేకుంటే అదే తెలంగాణతో విడిపోయిన రోజున జరుపుకోవాలో తెలియక చాలా మంది సిందిగ్ధంలో ఉండేవారు. 2014 జూన్ 2న విభజన జరిగాక ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి నవ నిర్మాణ దీక్షలు చేపట్టిందేగానీ ఏపీ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించలేదు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1 నుంచి నిర్వహిస్తూ వస్తోంది.
ఆంధ్రుల కోసం పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం:
ఒకప్పుడు మద్రాస్ రాష్ట్రంలో తెలుగు వాళ్లు భాగమై ఉండేవారు. వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ అప్పట్లోనే తెలుగు వారంతా కలిసి భారీ ఉద్యమాన్ని చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్ల 1953 అక్టోబరు 1వ తేదీన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ‘ఆంధ్ర రాష్ట్రం’ ఏర్పాటైంది. అందులో రాయలసీమ, కోస్తా జిల్లాలతో పాటు ఇప్పుడు కర్ణాటకలో ఉన్న బళ్లారి, ఒడిశాలోని బరంపురం ప్రాంతాలు ఉండేవి. అప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది. ఇక ఆ రోజు నుంచి అక్టోబర్ 1వ తేదినే ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలుగు ప్రజలు నిర్వహించేవారు.
ఆంధ్ర రాష్ట్రం కాస్తా విశాలాంధ్రగా ఏర్పాటు:
1953 అక్టోబరు 1న ఆంధ్రరాష్ట్ర అవతరణ జరిగాక ఆ వేడుక మూడేళ్ల ముచ్చటగా అయ్యింది. 1954, 1955లో ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు ఎంతో వేడుకగా చేసుకున్నారు. అప్పటికే పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో అక్కడి ప్రజలు కూడా తెలుగే మాట్లాడుతారు కాబట్టి తెలుగువారంతా ఒక్క రాష్ట్రంగా ఉంటే గొప్ప అభివృద్ధి సాధ్యమవుతుందని విశాలాంధ్ర పేరును తెరపైకి తెచ్చారు. అయితే తెలంగాణవాదులు అందుకు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ కసరత్తులు, కమిషన్ల తర్వాత 1956 నవంబర్ 1వ తేదిన రాయలసీమ, కోస్తా, తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. ఇది రాష్ట్రానికి రెండో పుట్టిన రోజు కావడం విశేషం. ఆ టైంలోనే బళ్లారిని కర్ణాటకలో, బరంపురం ప్రాంతాన్ని ఒడిశాలో కలిపేశారు.
నవంబర్ 1న ఉమ్మడి ఏపీ ఆవిర్భావం:
1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాతి నుంచి 2013 వరకు నవంబరు 1వ తేదినే ఏపీ అవతరణ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించుకునేవారు. 2014 జూన్ 2వ తేదిన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక అప్పటి నుంచి ‘జూన్ 2’న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకుంటూ వస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంపై మరోసారి చర్చ నడిచింది. జూన్ 2న జరుపుకోవాలని కొందరు అంటే, అక్టోబర్ 1నే జరుపుకోవాలని మరికొందరు వాదించారు. నవంబరు 1నే జరుపుకోవాలని ఎక్కువ శాతం మంది నిర్ణయించారు.
వైసీపీ వచ్చాక ప్రారంభమైన ఏపీ అవతరణ వేడుకలు:
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ జూన్ 2 నుంచి నవ నిర్మాణ దీక్షలు చేపట్టింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విజయవాడ బెంజి సర్కిల్లో ఈ దీక్షలు జరిగాయి. అక్టోబరు 1, నవంబరు 1.. రెండు రోజుల్లూ ఆవిర్భావ వేడుకలను నిర్వహించలేదు. అప్పటి నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టనేలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు నవంబర్ 1వ తేదీన ఏపీ అవతరణ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దీంతో అప్పటి నుంచి ప్రతి ఏటా నవంబర్ 1వ తేదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను జరుపుకుంటున్నాం.