ముఖ్యమంత్రి జగన్ విశాఖ రాజధాని ప్రకటన వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. వివిధ అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆయన ఈ ప్రకటన చేశారని ఆరోపించారు. వైయస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ వేగం పెంచిందని గుర్తు చేశారు కేశవ్. ఇలాంటి సమయంలో అందరి దృష్టిని మళ్లించడానికి జగన్ హఠాత్తుగా విశాఖ రాజధాని పాట పాడుతున్నారన్నారు. వివేకా హత్య జరిగిన రోజున కడప ఎంపీ అవినాష్ రెడ్డి తన సెల్ ఫోన్ నుండి ఎవరెవరితో మాట్లాడారనే అంశాలు ఈ కేసులో కీలకంగా మారాయని వ్యాఖ్యానించారు. ఆ కాల్ డేటా వివరాలను వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం జగన్ విశాఖ రాజధాని ప్రకటన చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిల్ పెండింగులో ఉందన్నారు. ఇలాంటి సమయంలో సీఎం ప్రకటన హైకోర్టు ధిక్కరణ అవుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో ఏపీ రాజధాని విశాఖ అన్నారు. ఏపీ మూడు రాజధానులపై సుప్రీం కోర్టులో విచారణలో ఉన్న సమయంలో కాబోయే రాజధాని విశాఖకు రావాలని ఇన్వెస్టర్లను కోరారు. తాము త్వరలోనే విశాఖకు మారబోతున్నామని చెప్పారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.