Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థపై తనకు కోపం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారి నుంచి శ్రమ దోపిడీ జరుగుతుందని చెప్పారు. వాలంటీర్లు వితంతుల గురించి సర్వే చేయడం ఎందుకు అని పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ దుమారం రేగిన సంగతి తెలిసిందే. క్షమాపణ చెప్పాలని వాలంటీర్లు నిరసనలకు దిగారు. ఈ రోజు దెందులూరులో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
ఏపీని తట్టి లేపుతున్నానని.. ఇందుకోసం తాను చనిపోయేందుకు సిద్ధం అని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. 30 వేల మంది మహిళలు మిస్ అయితే సమస్య కాదా అని అడిగారు. ఎవరు ఎవరితో తిరిగారు.. ఎవరు ఎవరితో పడుకున్నారా..? ఇవా సమస్యలా..? అని నిలదీశారు. ఏపీని పట్టి పీడిస్తోన్న జలగ జగన్ అని విమర్శించారు. జగన్ ఫ్యాక్షనిస్ట్ అని, అతని మనస్తత్వం మారలేదని విమర్శించారు. అతను ఎప్పుడూ విప్లవకారుడితో గొడవ పెట్టుకోలేదని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ అనే వాడు విప్లవకారుడు అని తెలిపారు. మీకు మీరు మద్దతు ఇచ్చుకోవాలని.. మీ బిడ్డలను.. ఆడబిడ్డలను సంరక్షించుకోవాలని సూచించారు.
వైసీపీ నేతలు అనే మాటలకు తన భార్య కూడా ఏడుస్తోందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. తనను, తన కుటుంబ సభ్యులను నిందించొచ్చు.. కానీ తాను అలా అనని పేర్కొన్నారు. జగన్ సంస్కార హీనుడు అని.. అతను చదువుకోలేదని విమర్శించారు. తాను రోజుకు రూ.2.5 కోట్లు సంపాదించగలనని.. ఏడాదికి కనీసం 200 రోజులు పనిచేస్తే రూ.400 కోట్లు సంపాదిస్తానని పవన్ కల్యాణ్ వివరించారు. ఇవన్నీ వదలుకొని, మీ కోసం వచ్చానని.. సమస్యలపై పోరాడుతున్నానని తేల్చిచెప్పారు.