కడప: ప్రభుత్వ పురుషుల కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలు సంయుక్తంగా ఏపీఎస్ఎస్ఈసీ సౌజన్యంతో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఆర్ట్స్ కళాశాలలో జేకేసీ ఆధ్వర్యంలో 21న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.
కడప: బద్వేల్ రూరల్ ఎస్సైగా కల్లూరి జయరామిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన అనంతపురం జిల్లాలో పనిచేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బద్వేల్ రూరల్ పరిధిలో శాంతిభద్రతలను పరిరక్షిస్తానని ఎస్సై తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
CTR: కాణిపాక ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా స్వర్ణ రథోత్సవం జరిగింది. కాణిపాక ఆలయంలో ప్రతినెలా పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజు ఉదయం సంకటహర చతుర్థి నిర్వహించి, రాత్రి వేళలో స్వామివారిని బంగారు రథంపై ఊరేగిస్తారు. నిన్న రాత్రి జరిగిన కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ ఈఓ పెంచల కిషోర్, అధికారులు పాల్గొన్నారు.
W.G: గురువారం ఉ.9 గంటల నుంచి పాలకొల్లు చాంబర్స్ కళాశాలలో ఏపీ ప్రభుత్వ శిక్షణ, ఉద్యోగ కల్పనా సంస్థ సౌజన్యంతో 13 కంపెనీలతో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డి. వెంకటేశ్వరరావు చెప్పారు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ,హెచ్‌డిబి, డెక్కన్ కెమికల్స్, పానాసోనిక్, ఇండో ఎంఐఎం, ఇసుజు, కాగ్నిజెంట్ వంటి సంస్థలు పాల్గొంటాయని తెలిపారు.
SKLM: శ్రీకాకుళం డీఎంహెచ్ఓ టి. బాల మురళీకృష్ణ, సీసీ వాన సురేశ్ కుమార్‌లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల మూడవ తేదీన ఏసీబీ దాడుల్లో వీరు పట్టుబడ్డారు. దీంతో విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఈనెల 17 వరకు రిమాండ్ విధించారు. దీనిపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందించటంతో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. వీరిని సస్పెండ్ చేసింది.
ATP: జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సంక్లిష్టమైన అర్జీలను వదిలిపెట్టకుండా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గుంతకల్లు రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామస్థాయిలో సమస్యలను పరిష్కరించాలన్నారు. వీఆర్వోలు, సర్వేయర్లు గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
ATP: వజ్రకరూరులో జనార్దన వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నరసింహమూర్తి, గ్రామ పెద్దలు తెలిపారు. రాత్రికి గరుడోత్సవం జరుగుతుందన్నారు. శుక్రవారం సాయంత్రం బ్రహ్మరథోత్సవం, 19న పల్లకీ సేవ నిర్వహిస్తామని చెప్పారు. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సత్యసాయి: పరిగి మండలం PHCలను డీఎంహెచ్ఓ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జై భీమ్ పార్టీ నాయకులు డీఎంహెచ్ఓకు వినతి పత్రం అందజేశారు. జై భీమ్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా ఏర్పడిన PHCలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కొత్తగా ఏర్పడిన PHCలకు స్థలం కేటాయించినప్పటికీ భవననిర్మాణాలు మొదలు కాలేదన్నారు.
BPT: జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ జిల్లా నుండి బదిలీ చేయబడ్డారు. వారిని రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) శాఖలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) CEOగా నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే బాపట్ల జాయింట్ కలెక్టర్ పదవికి అవసరమైన ఇంఛార్జీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
సత్యసాయి: సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ వ్యవహారంపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపీయింగ్‌పై సమగ్ర విచారణ చేపట్టాలని డీఎంఈ డాక్టర్ నరసింహంను ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉంది? ఏ స్థాయిలో అధికారులు సహకరించారు? అన్న అంశాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు.
PLD: నాదెండ్ల మండలంలో 17 వేల ఎకరాల రైతుల భూములు నిషేధిత జాబితాలో చేర్చడంపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పల్నాడు కలెక్టర్‌కి ఫోన్ చేసి వెంటనే స్పందన కోరారు. అధికారుల ఉదాసీనతను తప్పుబట్టి, రైతులకు న్యాయం చేయాలని కోరారు. అనధికార లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. P-4 విధానాన్ని విజయవంతం చేయాలన్నారు.
BPT: జిల్లా కలెక్టర్ వెంకట మురళి బుధవారం క్యాంపు కార్యాలయంలో మాత శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం ఆగస్టులో జిల్లాలో చోటుచేసుకున్న రెండు ప్రసవ మరణాల నేపథ్యంలో మాత శిశు మరణాల నివారణ కమిటీతో కలిసి ఈ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి గర్భిణి ఆరోగ్యాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి, పూర్తి పర్యవేక్షణ కల్పించాలన్నారు.
CTR: జిల్లాలోని 2వ పట్టణ పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సంతపేటకు చెందిన నలుగురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. నిందితుల నుంచి రూ.48 వేల నగదుతోపాటు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బెట్టింగ్ వ్యసనం జీవితాలను సర్వ నాశనం చేస్తుందని, వాటి జోలికి ఎవ్వరూ వెళ్లకూడదంటూ హెచ్చరించారు.
PLD: వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సివిల్స్ అభ్యర్థుల కోసం 30 నెలల ఉచిత శిక్షణ పథకాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించి ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళా అభ్యర్థుల్లో 10 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసి, ఉచితంగా కోచింగ్, వసతి, భోజన సదుపాయాలు అందించబడతాయని ఆయన తెలిపారు.
GNTR: ఫిరంగిపురం నూతన సీఐగా కే.శివరామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిరంగిపురం మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, గంజాయి, అక్రమ బెల్ట్ షాపులు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపారు.