నెల్లూరు జిల్లాలో శెనగ పంటను క్వింటాలకు రూ. 5875 వేల మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని జేసీ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. రైతులు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2వ తేదీ లోపు తమ గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. తేమ శాతం 14% లోపు ఉన్న పంటను మాత్రమే సేకరిస్తామన్నారు. విక్రయించిన ఐదు రోజుల్లోనే నగదు జమ అవుతుందన్నారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండలం అంగులూరు ప్రభుత్వ పాఠశాలలో ఫోక్స్ చట్టంపై SI సత్యనారాయణ శుక్రవారం అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాలికల తమపై జరిగే వేధింపుల పట్ల మౌనంగా ఉండకూడదని తెలిపారు. ఫోక్స్ చట్టం ద్వారా లభించే రక్షణ గురించి వివరించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
GNTR: ప్రజా రాజధాని అమరావతిలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి ప్రతీకగా నిలవాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. త్వరలో నిర్మించబోయే సెంట్రల్ లైబ్రరీ భవన నమూనాను పరిశీలించారు.
ELR: నూజివీడు పట్టణంలో శుక్రవారం మెటాస్ విద్యాసంస్థలో న్యాయ దినోత్సవం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జ్ షేక్ పెద కాసిం మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యాహక్కు చట్టం, బాల్యవివాహాల నిరోధక చట్టం, మోటార్ వెహికల్ చట్టాలపై అవగాహన పెంపొందాలన్నారు. ఇందులో సీనియర్ న్యాయవాది ఎస్ కే డి ప్రసాద్ పాల్గొన్నారు.
AKP: ఈనెల 22న విశాఖలో జరిగే సాగర సంగ్రామ దీక్షను జయప్రదం చేయాలని పీఆర్డీయూ జిల్లా అధ్యక్షులు డీ. గోపినాధ్ తెలిపారు. శుక్రవారం ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. సీపీఎస్ ఉద్యోగుల హక్కుల సాధన కొరకు ఏపీసీపీఎస్ఈఏ ఈ సాగర సంగ్రామ దీక్ష కార్యక్రమాన్ని తలపెట్టిందన్నారు. ఈ దీక్షలో పీఆర్డీయూ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
NTR: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నిత్య అన్నదాన పథకం కోసం గుంటూరు జిల్లా రాజేంద్రనగర్ వాస్తవ్యులు శ్రీ ముప్పవరపు రమేష్ కుమార్, శ్రీమతి మాధవి లత దంపతులు విరాళం అందజేశారు. ఈ మేరకు వారు తమ కుమారుడు UASలో నివసిస్తున్న శ్రీ మెగా హర్ష ముప్పవరపు పేరిట రూ.5,01,116 చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు దాతలను అభినందించారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 2,56,497 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 323 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 15 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారు అని, 2875 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.
ATP: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు నియామకాలకు యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ప్రతాప్ రెడ్డి కోరారు. ఇంటర్మీడియట్ గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులలో 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. మార్చి 9- 12 వరకు agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
VZM: మెరకముడిదాం(మం) సోమలింగాపురంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 23 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఈ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ 604 విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.
VSP: బీజేపీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర కార్యాలయం(విశాఖ)లో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రజల వినతులు స్వీకరించారు. ఎస్‌వీఎస్ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి శుక్రవారం ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు.
CTR: పలమనేరు విద్యుత్ సబ్ స్టేషన్‌లో శనివారం మరమ్మత్తులు నిర్వహిస్తున్నట్టు డీవైఈఈ జీవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో పలమనేరు రూరల్, గంగవరం, బైరెడ్డిపల్లి మండలాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తించి సహకరించాలని కోరారు.
సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్లు, బస్సులలో ప్రయాణికులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడే ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. రద్దీ సమయాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతూ అనుమానితులను మొబైల్ స్కానింగ్ పరికరాలతో తనిఖీ చేస్తున్నారు.
PLD: వినుకొండ పట్టణంలో అర్బన్ పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ నాయకులు శుక్రవారం జిల్లా ఎస్పీ కృష్ణారావుకు వినతి పత్రం సమర్పించారు. సీఎం పర్యటన ఏర్పాట్ల సమీక్ష కోసం వినుకొండ వచ్చిన ఎస్పీని, సీపీఐ పట్టణ కార్యదర్శి రాము నేతృత్వంలోని బృందం మర్యాదపూర్వకంగా కలిసి ఈ విజ్ఞప్తిని చేశారు.
గుంటూరు బృందావన్ గార్డెన్స్‌కు చెందిన నాలి గురుబ్రహ్మం, శాంతి దంపతులు శుక్రవారం మార్టూరు సమీపంలోని రాజుపాలెం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అద్దంకిలో ఉన్న కుమార్తెను చూసి బైక్‌పై తిరిగి వస్తుండగా, బస్సు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
SKLM: సారవకోట(మం) తర్లిలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకులు, జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు ఎంపీపీ బైరగినాయుడు ఉన్నారు.