W.G: నరసాపురంలో అదనపు కట్నం వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 14వ వార్డుకు చెందిన మహమ్మద్ రెహినాకు, మహమ్మద్ షబ్బీర్ 2021 జూన్ 28న వివాహం జరిగింది. పెళ్లైన మరుసటి రోజు నుంచే భర్త షబ్బీర్, మహమ్మద్ నసీమా, మహమ్మద్ నసీర్, మహమ్మద్ జబీన్, సందీప్ రెడ్డి అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులుల తెలిపారు.
NDL: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మార్చి 1న కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి సోమవారం తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్, విద్య, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష జరగనుందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు పూర్తి వివరాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వెల్లడించారు.
అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలంలోని చిన్నవరం పాడు క్రాస్ రోడ్డు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు రవి మృతి చెందినట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు. సాయంత్రం పొలానికి వెళ్తున్న రవి సైకిల్ అదుపుతప్పి పడిపోగా, వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
TPT: ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ నవ్య ఆటో ఫైనాన్స్‌లో సుమారు రూ. 85 లక్షలు మోసం చేసిన కేసులో యుగంధర్ (33)ను ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. వాహన రుణాల పేరుతో వ్యక్తులను తీసుకువచ్చిన వారి పేర్లపై రూ. లక్ష లోన్ మంజూరు చేయించేవాడు. రూ. 40 వేలు వారికి ఇచ్చి, రూ. 60 వేలు స్వలాభానికి వినియోగించుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
VZM: ఈ నెల 28న చీపురుపల్లిలో జరగనున్న గ్రామసభల ఏర్పాట్లపై అదికారులతో సోమవారం డీడీఓ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్యక్రమాలు సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. గ్రామసభలకు ప్రజల హాజరు పెరిగేలా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఈ సమీక్షలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
VSP: కైలాసగిరి పర్యాటక ప్రాంతంలో పరమశివుడి ఆయుధమైన 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు త్రిశూల్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రాజెక్ట్‌కు సుమారు రూ.1.55 కోట్ల వ్యయం, LED లైట్లతో రాత్రిపూటనూ మెరవనీయంగా ఉంటుంది. క్రేన్ సాయంతో విడి భాగాలు అమర్చగా, సందర్శకులు కూర్చొని ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి వేదిక కూడా ఏర్పాటు చేస్తున్నారు.
KRNL: ఓర్వకల్లు మండల పరిధిలోని కొంతలపాడులోని యాగంటయ్య ఉత్సవాలు రేపటి నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దారు. 25, 26 తేదీల్లో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 27వ తేదీన పాలపండ్ల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
ELR: చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో సోమవారం ఎక్సైజ్ శాఖ అధికారులు నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. అనంతరం గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే నాటుసారా తయారీకి, విక్రయాలకు దూరంగా ఉంది సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
SKLM: కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచిందని పలాస మండలం బొడ్డపాడులోని ఉపాధి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి త్వరగా పనులు కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు స్థానిక సచివాయల సిబ్బందికి ఏఐసీసీటీయూ నాయకులు కుత్తుం దుష్యంత్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధి కూలీలు ఉన్నారు.
E.G: గోదావరి సెంట్రల్ డివిజన్ ధవళేశ్వరం సర్కిల్ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరుతూ MLC రాజశేఖర్ సోమవారం సీఎం చంద్రబాబును కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుతో కలిసి ఆయన సీఎంకు వినతిపత్రం అందజేశారు.కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన అభివృద్ధి చేయాలని కోరారు.
SS: జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షలు జరిగే సమయంలో కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ATP: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు మూడు ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసినట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ తెలిపారు. కూడేరు, తిమ్మసముద్రం, ఊరిచింతల గ్రామాల్లో 293 ప్లాట్లు కేటాయింపునకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అన్నమయ్య: సీఎం చంద్రబాబు తల్లిదండ్రులపై అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలను వైసీపీ నాయకులు సమర్థించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్ కేకే చౌదరి మండిపడ్డారు. రైల్వే కోడూరులో సోమవారం ఆయన మాట్లాడారు. చట్టం తన పని తాను చేస్తోందని, కక్షసాధింపులు లేవని స్పష్టం చేశారు.
KDP: వితంతువులు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సింహాద్రిపురం MPDO శ్రీనివాసరావు తెలిపారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల ఆప్షన్ ఓపెన్ కాలేదనే సోషల్ మీడియా వార్తలు అవాస్తవమని, ప్రజలు ఇలాంటి నకిలీ వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. వితంతువులు విడో పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.