కడప: జిల్లాలో శనివారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. నగరంలోని ద్వారకా నగర్‌లోని ఇందిరా భవన్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ ATMలను పగులగొట్టి 6 లక్షలు, ఒంటిమిట్టలోను ఎస్బీఐ ఎటీఎంలో 36 లక్షలు నగదును దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
KDP: చిట్వేలి మండలం కే.కందులవారి పల్లిలో ఆదివారం ఉదయం పది గంటలకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ పాల్గొంటారని ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని కోరారు.
కృష్ణా జిల్లా: రైళ్లలో దొంగతనాలు చేసే ఉత్తరప్రదేశ్‌కు చెందిన సూర్యపాల్ సింగ్ అనే వ్యక్తిని విజయవాడ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశామని ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం అతడు స్టేషన్‌లో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని 3 కేసులకు సంబంధించిన రూ.1.77లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. విచారణ అనంతరం సూర్యపాల్ సింగ్‌ను రిమాండ్‌కు పంపామన్నారు.
NLR: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచల శైవ క్షేత్రం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా చిల్లకూరు హైవేపై ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన వారు నెల్లూరు నగరం వనంతోపు సెంటర్‌కు చెందిన వారుగా స్థానికులు గుర్తించారు. గాయపడిన వారిని గూడూరు ఏరియా ఆసుపత్రి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ: తిరుపతి వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడం దారుణమని పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి శనివారం విమర్శించారు. దేవుడి ప్రసాదంపై ప్రభుత్వంలో ఉన్నవారే ఆరోపణలు చేయడం మొదటిసారిగా చూస్తున్నామన్నారు. దీనిపై న్యాయ విచారణకు ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
WG: భీమవరం పట్టణంలోని 33వ వార్డులో కొలువైన శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి చీరల వేలంపాట ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు పరమేశ్వర మాట్లాడుతూ.. నూకాలమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వేలంపాట జరుగుతుందన్నారు. ఆసక్తిగల భక్తులు వేలంపాటలో పాల్గొనవచ్చు అన్నారు.
KRNL: కర్నూలు ట్రాఫిక్ ఎస్సై మల్లన్న, ఆర్ఎస్సై అహ్మద్ హుస్సేన్ తమ సిబ్బందితో కలిసి శనివారం రాత్రి నగర శివారులోని సుంకేశుల రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. హైవే వైపు నుంచి వచ్చే వాహనదారులను తనిఖీ చేసి 11 మంది మద్యం తాగినట్లు గుర్తించారు. ఐదు బైకులు, రెండు ఆటోలు, నాలుగు కార్లు సీజ్ చేశారు. సదరు వాహనచోదకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ATP: తాడిపత్రి పరిధిలోని పెద్ద పొడమల గ్రామ సమీపంలో మల్లికార్జున(43) అనే వ్యక్తి శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఇంఛార్జ్ ఎస్సై నాగప్ప చెప్పారు. పెద్ద పొడమల గ్రామానికి చెందిన మల్లికార్జున గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
SRKL: కాశీబుగ్గ-పలాసలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జవహర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో సినర్జిన్ కాస్టింగ్, అపోలో ఫార్మసీ, ఫార్మా సంస్థలు హాజరవుతున్నాయని అన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదువు పూర్తి చేసినవారు అర్హులు. 18-35 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కృష్ణా: దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లను విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు శనివారం సాయంత్రం పరిశీలించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా, క్యూ లైన్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అక్కడి విధులలో ఉన్న సిబ్బందికి సీపీ ఆదేశాలిచ్చారు.
కృష్ణా: తోట్లవల్లూరు మండల కేంద్రంలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొంటారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పామర్రు MLA కార్యాలయ వర్గాలు ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి.
విశాఖ: ఈ మధ్య కురిసిన అధిక వర్షాలకు గూడెం కొత్తవీధి మండలంలోని చామగెడ్డ వాగు వద్ద వంతెన కొట్టుకుపోయింది. ఈ సందర్భంగా అక్కడ తాత్కాలిక వంతన నిర్మాణ పనులు ప్రారంభించామని పంచాయతీరాజ్ ఏఈఈ జ్యోతిబాబు తెలిపారు. శనివారం చామగెడ్డ వాగు వద్ద తాత్కాలిక వంతెన పనులను ప్రారంభించారు. వర్షాలకు వంతెన కొట్టుకుపోవడం వల్ల సుమారు 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు.
VZM: ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా తమకి అదనపు బాధ్యతలు అప్పగించడం సరికాదని జిల్లాకు చెందిన పలువురు సచివాలయ ఏఎన్ఎంలు వాపోయారు. ఈ సందర్బంగా వారంతా DMHO భాస్కర్ రావును శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అతికించే పనులు తమకి అప్పగించడం వలన ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తాము ఖాళీగా లేమని తాము అదనపు డ్యూటీలు చేయలేమని పేర్కొన్నారు.
KKD: తుని పట్టణంలోని పురపాలక సంఘం హై స్కూల్ నందు ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ప్రముఖ వైద్యులు పలు కంటి వ్యాధులకు చికిత్స అందిస్తారని పేర్కొన్నారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ప్రకాశం: బాపట్ల జిల్లా బల్లికురవలోని గ్రోమోర్, ఫర్టిలైజర్స్ షాపులను శనివారం మండల వ్యవసాయ అధికారి కుమారి పరిశీలించారు. ఎరువులు, పురుగు మందులు కొన్న రైతులకు బిల్లులు ఇవ్వాలని, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు ఎరువులు, పురుగుమందులు అందించాలని షాప్ యజమానులను ఆదేశించారు. అధిక రేట్లకు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని షాపు యజమానులకు తెలియజేశారు.