నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆరో రోజు పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. బైరెడ్డి పల్లె మండలంలో పలువురితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సాకే గ్రామంలో చెరకు రైతు వెంకట రమణ తన బాధను చెప్పుకున్నారు. ఒకటిన్నర పొలం, బెల్లం గానుగ చూపించి ఇబ్బందులను తెలిపారు. చెరకు రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని లోకేశ్ మండిపడ్డారు. ‘వైసీపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుల మందుల వల్ల రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయానికి సాయం అందించడం బాధ్యత. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చెరకు రైతుల సమస్యలపై దృష్టిసారిస్తాం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తాం. కౌలు రైతులను ఆదుకుంటాం’ అని లోకేశ్ చెప్పారు.
బేలుపల్లెలో భవన నిర్మాణ కార్మికులతో లోకేశ్ మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి బాగోలేదని కార్మికుడు ఫయాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఉచిత ఇసుక విధానం తీసుకొస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ‘భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉన్న నిధులు కూడా ప్రభుత్వం పక్క దారి పట్టించింది. వైసీసీ నాయకులు ఇసుక అక్రమ రవాణా ద్వారా వేల కోట్లు సంపాదిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది’ అని లోకేశ్ విమర్శించారు.
వాల్మీకి సామాజిక వర్గం ప్రతినిధులతో నారా లోకేశ్ సమావేశం అయ్యారు. ‘వాల్మీకులకు సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సత్యపాల్ కమిటీ ఏర్పాటు చేసి వాల్మీకుల స్థితిగతులపై అధ్యయనం చేశాం. ఆ రిపోర్ట్ ఆధారంగా వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని 2017లో అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాం. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. వైసీపీ ఎంపీలు వాల్మీకుల గురించి మాట్లాడటం లేదన్నారు. వాల్మీకిలకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించడం కోసం కంపెనీలు ఏర్పాటు చేస్తాం’ అని లోకేశ్ పేర్కొన్నారు.