అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ( NASA ) నిర్వహించే అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం International Air And Space Program (iasp) కు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచాల కైవల్య రెడ్డి విద్యార్థిని ఎంపికైంది. 15 నుంచి 25 ఏళ్ల లోపు వయసున్న 50 – 60 మంది విద్యార్థులను నాసా బాగస్వామి ఏఈఎక్స్ఏ (Aexa Aerospace) ఎంపిక చేసింది. ఇందుకుగాను అన్ని దేశాలనుంచి విద్యార్థుల ప్రాజెక్ట్ నమూనాలను, దరఖాస్తులను ఆహ్వానించింది.
వివిధ దేశాలనుంచి ప్రాజెక్ట్ నమూనాలు రాగా.. వాటిలో అత్యుత్తమ నమూనాలు పంపిన విద్యార్థులను ఆన్ లైన్ ద్వారా ఇంటర్వూ చేసి ఎంపిక చేశారు. తాజాగా నిర్వహించిన ఇంటర్వూకు హాజరైన కైవల్య రెడ్డి ఎంపికైంది. ఇందుకుగాను ఏఈఎక్స్ఏ (Aexa Aerospace) నుంచి కైవల్యకు సమాచారం అందింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంపికైన విద్యార్థులు ఇదే విధంగా పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తున్నారు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి ఆరు నెలలు ఆన్ లైన్ లో శిక్షణ ఇవ్వనున్నారు. నవంబర్ లో అమెరికాలోని (USA) అలబామా రాష్ట్రంలో 15 రోజుల వ్యోమోగామి (Astronaut) శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో పాటు విద్యార్థులను బృందాలుగా ఎంపికచేసి నాసా శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అవకాశం కల్పించనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) నిడదవోలుకు చెందిన కుంచాల శ్రీనివాస రెడ్డి, విజయలక్ష్మీ దంపతుల కుమార్తె కైవల్య రెడ్డి (15) పదో తరగతిపరీక్షల్లో టాప్ గ్రేడ్ లో పాసైంది. ఖగోళశాస్త్రంపై ఆసక్తి కలిగి ఉత్తమప్రదర్శనను కనబరిచేది. అతి చిన్న వయసులోనే ఐఏఎస్పీకి ఎంపికైన రెండవ భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.