గణతంత్ర భారతం ఇప్పుడు ప్రమాదంలో ఉందని, అందుకే బీజేపీని ఓడించడమే మన ముందున్న టాస్క్ అని కమ్యూనిస్ట్ నేత డీ రాజా పిలుపునిచ్చారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఆరెస్సెస్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరన్నారు. భారత్ లౌకికవాద దేశమని కానీ బీజేపీ హిందూ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజలకు విద్య, ఉద్యోగం కనీస అవసరాలు అన్నారు. కానీ బీజేపీ వీటిని పక్కన పెట్టి మతాన్ని బీజేపీ ఉపయోగించుకుంటోందన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని మోడీ చెబుతారని, కానీ ఆయన అదానీ, అంబానీ, టాటా, బిర్లా వెంట ఉన్నారన్నారు. భారత్ హిందూ దేశంగా మారితే ప్రమాదమన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తోందన్నారు. బీజేపీ వన్ నేషన్ అంటూ చెబుతోందని, చివరకు వన్ పార్టీ, వన్ లీడర్ స్థాయికి తీసుకు వెళ్తోందన్నారు. మనమంతా బీజేపీపైన పోరాడాలన్నారు.
మనం ఇప్పుడు మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలన్నారు. మనమంతా కలిస్తే బీజేపీని ఓడించడం కష్టం కాదని చెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్ దేశవ్యవస్థలను మార్చాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ పాలన నుండి భారత్‌ను దూరం చేయాలన్నారు. గవర్నర్లు ముఖ్యమంత్రులను ఇబ్బంది పెడుతున్నారని, ఇదేనా ఫెడరల్ స్ఫూర్తి అన్నారు. మహాత్మా గాంధీ ఏం చెప్పారని, ఈశ్వర్ అల్లా తేరేనామ్ అని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు బీజేపీ అందరినీ కలుపుకొని పోవడం లేదన్నారు. మన ముందు ఉన్న అసలైన టాస్క్ బీజేపీపై ఫైట్ చేసి, గద్దె దింపడమే అన్నారు. అందరం కలిస్తే ఇదేం అసాధ్యం కాదన్నారు. తెలంగాణ గురించి కూడా మాట్లాడారు రాజా. తెలంగాణ పోరాటయోధులకు పుట్టినిల్లు అన్నారు. కరెంట్ కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని, రైతు బంధు, దళిత బంధు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు.