తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఏపీలోకి అడుగుపెట్టాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంధ్ర ప్రజలపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు క్షమాపణలు చెప్పాలని తెలిపారు. క్షమాపణ చెప్పకుండా వస్తే ఏపీలో కేసీఆర్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు. విభజన సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ ఏపీలో విస్తరిస్తారని.. ఏపీలో త్వరలోనే కేసీఆర్ పర్యటిస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో శనివారం జీవీఎల్ నరసింహా రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టే ముందు ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలి. ఏపీవాళ్లను అన్ని విధాలుగా బూతులు తిట్టి.. అవమానపరచి రాజకీయ పబ్బం గడుపుకున్నావు. ఈరోజు ఆంధ్రవాళ్ల ఓట్లు కొల్లగొట్టే ముందు క్షమాపణ చెప్పాలి. రాజకీయాలు ఎవరైనా చేసుకోవాలి. కానీ ఆంధ్రవాళ్ల అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కించపరిచాడు. దానికి ఆయన క్షమాపణ చెప్పి ఏపీలోకి రావాలి’ అని నరసింహా రావు డిమాండ్ చేశారు.
అయితే ఏపీలో పర్యటిస్తానని కేసీఆర్ ఇంకా ప్రకటించనే లేదు. కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ రాకను వ్యతిరేకిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పేరుతో ఏపీలో రాజకీయాలు చేసుకోవచ్చు కానీ.. విభజన సమయంలో ఆంధ్ర వారిపై చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలనే డిమాండ్ పెరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇదే విషయాన్ని మీడియా ముందు ప్రస్తావిస్తున్నారు. రోజురోజుకు ఈ డిమాండ్ తీవ్రమవుతుండడంతో కేసీఆర్ దీనిపై ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.