కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వ స్వామి కొలువైపు పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)కు నిత్యం వేలాది మంది భక్తులు పోటెత్తుతుంటారు. స్వామి వారి దర్శనం కోసం పడిగాపులు కాస్తుంటారు. అలాంటి భక్తులు (devotees) అందరికీ శుభవార్త. ఇకపై కొండపైన వసతి సౌకర్యం కోసం భక్తులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా బస చేసేందుకు వీలుగా విశాఖకు చెందిన దాత మూర్తి విరాళంగా రెండు మొబైల్ కంటైనర్ల(Mobile containers)ను అందించారు. గురువారం టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఒక కంటైనర్ను జీఎన్సీ వద్ద టీటీడీ ట్రాన్సుపోర్టు డిపోలో విధులు ముగించుకుని డ్రైవర్లు (Drivers ) విశ్రాంతి తీసుకునేందుకు కేటాయించారు. మరో కంటైనర్ ను రాంభగీచా -3 ఎదురుగా ఏర్పాటు చేశారు.తిరుమల (Tirumala) లో గదుల లభ్యత పరిమితంగా ఉందని, నూతన విశ్రాంతి గదుల నిర్మాణానికి అనుమతి లేదని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి(TTD Chairman YV Subbareddy) తెలిపారు పలుచోట్ల ఉన్న పాత విశ్రాంతి గృహాలను పునర్నిర్మాణం చేస్తున్నట్టు వివరించారు. ఈ క్రమంలో మొబైల్ కంటైనర్లను దాత అందించారని, ఇందులో భక్తులు బస చేసేందుకు పరుపులు, స్నానపు గది, మరుగుదొడ్లు ఉన్నాయని చెప్పారు.ఈ కంటైనర్ల విలువ దాదాపు రూ.25 లక్షలు అని తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగించుకునేందుకు వీలుగా రాబోయే రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.