వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలిచి తీరుతుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేశ్ మండుటెండలో కూడా పాదయాత్ర విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. పాదయాత్రలో లోకేశ్ పరిపూర్ణమైన నాయకుడిగా రూపుదిద్దుకుంటున్నారని కొనియాడారు.
లోకేశ్(Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, 356 రోజులు మాత్రమే ఈ ప్రభుత్వానికి సమయం ఉందని అన్నారు. ఇక రోజులు లెక్క పెట్టుకోవడమే తరువాయి అని అన్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లి.. లోపాయికారిగా స్వప్రయోజనాల కోసం మాట్లాడుకుంటున్నారని విమర్శించారు. ‘‘విశాఖలో పేర్ల మార్పిడి పరంపర కొనసాగుతోంది. సీత కొండ వ్యూ పాయింట్ పేరును వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా మార్చడం సరి కాదు. ఆ ప్రాంత మనోభావాలు దెబ్బ తీసేలా ఉంది. అవసరమైతే జాతీయ నాయకుల పేర్లు పెట్టాలని కోరుతున్నాం’’ అని గంటా శ్రీనివాసరావు అన్నారు.