తూర్పుగోదావరి జిల్లా కొవ్వురు(Kovvuru)లో జగనన్న విద్యా దీవెన నిధులను సీఎం జగన్ (CM JAGAN) బటన్ నొక్కి విడుదల చేశారు. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.703 కోట్ల నిధులను నేరుగా జమ చేశారు. ఏపీ లోని ప్రతిభావంతులైన ప్రతీ విద్యార్థికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, గొప్పవారు కావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని సీఎం వెల్లడించారు. నిరుపేద కుటుంబాలను మార్చేసే శక్తి ఒక్క చదువు(Study)కు మాత్రమే ఉందని అన్నారు. చదువుతో సమస్తము సాధ్యమని ఆయన తెలిపారుఅందుకే తమ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వ విద్యాలయాలను, వాటిలో బోధనా పద్ధతుల రూపురేఖలను సమూలంగా మార్చేశామని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లతో పోటీపడేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దామని, క్లాస్ రూమ్ లలో డిజిటల్ బోధన(Digital teaching)కు రూపకల్పన చేశామని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రతీ ఇంటి నుంచి ఓ సత్య నాదెళ్ల (Satya Nadella) రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.ప్రతిభ కల విద్యార్థులు విదేశాలలో చదివేందుకు తమ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయని, అందుకే విద్యపై ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందని తెలిపారు. విద్యా దీవెన (Vidya divena) కింద ఇప్పటి వరకు రూ.10,636 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం వివరించారు. ఈ ఖర్చును హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ గా ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత(Taneti Vanita) మాట్లాడుతూ.. జగనన్న పాలనలో విద్యాశాఖలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. విద్యను పేదవాడి హక్కుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దేనని అన్నారు.రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే విద్యా దీవెన.. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలలో ఐటీఐ, పాలిటెక్నిక్(Polytechnic), డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు కాలేజీ ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది.