వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సీఎం జగన్ అన్నీ సిద్దం చేసుకుంటున్నారు. 175సీటు లక్ష్యంగా జగన్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో…. కొందరు అభ్యర్థులకు సీటు ఖరారు చేస్తున్నారు. తాజాగా… విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ ని ఖరారు చేశారు. ఈ మేరకు జగన్ ప్రకటన చేశారు.
గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా ఈ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ నేత గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడిన ఆయనను ఈసారి ఎదురొడ్డాలంటే నియోజకవర్గంలో మంచి పట్టున్న దేవినేని కుటుంబంతోనే సాధ్యమవుతుందని భావించిన జగన్.. అవినాష్‌ను అభ్యర్థిగా ప్రకటించినట్టు తెలుస్తోంది.
విజయవాడ తూర్పు నియోజకవర్గంపై అక్కడి నేతలతో సమీక్ష నిర్వహించిన జగన్ కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడారు. అనంతరం అవినాష్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 సంవత్సరాలు వైసీపీకి తిరుగుండదని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లాలని నేతలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అందరికీ వివరించి ఆశీర్వాదం తీసుకోవాలని, ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని జగన్ దిశానిర్దేశం చేశారు.