ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్టణం అవనుందని సీఎం జగన్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, అప్పుడే ఎలా మాట్లాడతారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సుప్రీంకోర్టుని కూడా సీఎం జగన్ గౌరవించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ఇదీ జగన్ నిరంకుశ వైఖరికి నిదర్శనం అని మండిపడ్డారు.
స్టే ఇవ్వలే..
అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలనే కుట్రతో జగన్ ఇలా కామెంట్ చేశారని మండిపడ్డారు. రాజధానుల అంశానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని గుర్తుచేశారు. మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం వెనక్కు తీసుకుందని తెలిపారు.
జగన్ ఆహ్వానం
ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఇన్వెస్టర్లను సీఎం జగన్ ఆహాన్వించారు. తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి సహకారం అవసరమని కోరారు. త్వరలో విశాఖపట్టణం ఏపీకి పరిపాలన రాజధాని కాబోతుందన్నారు. తాను కూడా విశాఖకు షిప్ట్ అవుతున్నానని తెలిపారు. విశాఖకు అందరూ రావాలని, అక్కడే పెట్టుబడులు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్టర్లను కోరారు.
విశాఖకు షిప్ట్
ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్టణం మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కోర్టు తీర్పుల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఉగాది నుంచి విశాఖ నుంచి పాలన కొనసాగుతుందని మంత్రులు చెబుతున్నారు. మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ల మీట్ విశాఖలో నిర్వహించాలని జగన్ సర్కార్ అనుకుంటుంది. పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా విశాఖ ఉందని ఇన్వెస్టర్లకు వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంతలో జగన్ కామెంట్స్ చేశారు. విపక్షాలు మాత్రం తప్పుపడుతున్నాయి.
3 రాజధానులు
జగన్ పగ్గాలు చేపట్టిన వెంటనే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. మండలిలో తగిన బలం లేకపోవడంతో అప్పటి మండలి చైర్మన్ షరీఫ్ తిరిగి పంపించారు. తర్వాత మండలిని రద్దు చేశారు. ఇంతలో అమరావతి రాజధాని రైతులు హైకోర్టులో కేసు వేశారు. అమరావతి రాజధానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్ విచారించాల్సి ఉంది. ఇంతలోనే సీఎం జగన్ ఇలా కామెంట్స్ చేశారు.