2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. తమకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆసక్తి లేదన్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన టీడీపీతో కలిసి వెళ్లాలని బీజేపీ భావిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి ఆలోచన ఇప్పుడు లేదని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. టీడీపీ – బీజేపీ పొత్తు వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి బీజేపీకి ఉన్న బలం సరిపోతుందని, కేసీఆర్ను ఎదుర్కోవడానికి తమకు మరో పార్టీ సహకారం అవసరం లేదన్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందని తాను చెప్పినట్లుగా ప్రచారం సాగిందని, నేను అలా చెప్పలేదన్నారు. అదే సమయంలో షర్మిల పార్టీకి సంబంధించి కూడా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.
తెలుగుదేశంతో పొత్తుపై ఆలోచన చేస్తున్నామని, తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు సంబంధించి మరిన్ని సభలను ప్లాన్ చేస్తున్నామని తరుణ్ చుగ్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటు, లోకసభ ఎన్నికల్లో 12 సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, షర్మిలకు అండగా నిలవాలని నిర్ణయించామని కూడా చెప్పినట్లు ప్రచారం సాగింది. అయితే టీడీపీ, షర్మిలకు సంబంధించిన ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు.