జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బీజేపీ అల్టిమేటం ఇచ్చిందా?… జాతీయ బీజేపీ నాయకత్వం జనసేనానికి అనుకూలంగానే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మూడు వర్గాలు ఉండటంతో… ఇక్కడి వైసీపీ వర్గంగా భావిస్తున్న నేతలు మాత్రం ఆయనకు అల్టిమేటం ఇచ్చినట్లుగానే చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల్లో తమతో వస్తే జనసేనతో కలిసి పోటీ చేస్తామని లేదంటే ఒంటరిగానే ముందుకు వెళ్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికలకు తాము టీడీపీ, వైసీపీలకు సమదూరంలో ఉన్నట్లు చెప్పారు. తాము ఎట్టి పరిస్థితుల్లో వైసీపీతో కలిసేది లేదని, అదే సమయంలో టీడీపీకి అంతే దూరంలో ఉన్నామని వెల్లడించారు. కానీ జనసేనతో పొత్తుకు మాత్రం బీజేపీ ఆసక్తి చూపిస్తోంది. కానీ తాము వద్దనుకుంటున్న… తెలుగుదేశంతో కలిస్తేనే రావాలని పవన్ పరోక్షంగా సంకేతాలు చెబుతున్నారు. వైసీపీని ఓడించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దనేది ఆయన ఉద్దేశ్యం. బీజేపీ మాత్రం టీడీపీ లేకుండా జనసేన అయితే ఓకే చెబుతోంది. లేదంటే దూరమే అని తాజాగా సోము వీర్రాజు వ్యాఖ్యలను బట్టి తేలిపోయింది.
pawan kalyan
2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంతో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో మాత్రం వేర్వేరుగా పోటీ చేయడం వైసీపీకి కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. వచ్చే 2024 ఎన్నికల్లో ఈ పొరపాటు చేయవద్దని పవన్ భావిస్తున్నారు. అందుకే మూడు పార్టీలు కలిసి వెళ్లాలనేది ఆయన అభిప్రాయం. కానీ బీజేపీలో ఉన్న మూడు వర్గాలు… మూడు రకాల ఆలోచనతో ఉంటాయనే వాదనలు ఉన్నాయి. తెలంగాణలో ఎదిగినట్లుగా ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి జగన్ వర్గం, చంద్రబాబు వర్గం, ఏ వైపు లేని వర్గాలు ఉన్నాయని చెబుతారు. ఒక్కో వర్గం ఒక్కో దిక్కు పార్టీని లాగుతూ.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారు చేస్తోందని అంటున్నారు.
pawan kalyan
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ పెద్దలు కూడా ఏపీపై సీరియస్‌గా దృష్టి సారించలేదు. 2023లో తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈశాన్య నాలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, కర్నాటక, తెలంగాణలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఢిల్లీ కమలం పెద్దలు ఈ ఎన్నికలపై దృష్టి సారించారు. తెలంగాణలో అధికార లేదా ప్రతిపక్ష హోదా వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ కార్యకలాపాలపై అడపాదడపా తప్పితే ప్రత్యేక దృష్టి పెట్టేందుకు సమయం చిక్కడం లేదు. దీంతో ఏపీ బీజేపీ నేతలు ఏం చెప్పిందే వేదంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వస్తే ఒకే.. లేదంటే తాము ఒంటరిగా పోటీ చేస్తామని వీర్రాజు చెప్పడం గమనార్హం. అదే జరిగితే గెలుపు మాట పక్కన పెడితే, ఎక్కువ నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకునే పరిస్థితి ఉండదనే సొంత పార్టీ క్యాడరే ఆవేదన వ్యక్తం చేస్తోందట.