గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది. సమ్మెను నిషేధిస్తున్నట్లు తెలిపింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ జీవో నెంబర్ 2 విడుదల చేసింది.
Andhra Pradesh: గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది. సమ్మెను నిషేధిస్తున్నట్లు తెలిపింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ జీవో నెంబర్ 2 విడుదల చేసింది. దీని ప్రకారం ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. దాదాపు రూ. 3 వేలు తగ్గించి జీతాలు జమ చేసింది.
ఈ ఎస్మా అనేది ఎసెన్సియల్ సర్వీసెస్ మెయిన్‌టీనెన్స్ యాక్ట్. ఇది సమ్మెలు, హర్తాళ్లు వంటి సందర్భాల్లో ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహన అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూసేందుకు 1981లో రూపొందించిన చట్టం. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది. 1980లో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికి పోయింది.
ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఉద్ధృత స్థాయిలో ఉద్యమించాయి. 1981లో కార్మిక సంఘాలు పార్లమెంట్ ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె కూడా చేయాలని పిలుపునిచ్చారు. క్రమంగా ఈ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం తొలుత 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ఎస్మా ఆర్డినెన్స్‌ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ఆర్డినెన్స్ స్థానంలో ఎస్మా చట్టం తీసుకొచ్చింది.