టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాయుడు విమర్శల వర్షం కురిపించారు. కుప్పం పర్యటన నేపథ్యంలో… పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలకు అంబటి కౌంటర్ ఇచ్చారు. కుప్పంలో జీవో 1 పాటించటాన్ని చంద్రబాబు తిరస్కరించడంపై మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడిన తీరు పిచ్చి కుక్క అరిచినట్లుగా ఉందని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించమని చెబుతున్న విషయంపై కూడా మంత్రి అంబటి ఫైర్ అయ్యారు.
జీవో 1 ప్రకారం రోడ్ల మీద బహిరంగ సభలు పెట్టకూడదని, నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే సభలు నిర్వహించాలని అంబటి గుర్తుచేశారు. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉండదా? అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు తిరిగితే ఏమవుతుంది? ఏమయ్యింది అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు తిరిగిన తర్వాతేగా టీడీపీ 23 స్థానాలకు పరిమితం అయ్యిందని ఎద్దేవా చేశారు.
కుప్పంలో జెడ్పీటీసీలు, ఎమ్పీటీసీలు గెలిచావా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. నా కుప్పం…నా కుప్పం అంటూ చంద్రబాబు రంకెలు వేస్తున్నాడని, ఆ కుప్పంలో ఇల్లు కాదు కదా ఓటు కూడా చంద్రబాబుకు ఎందుకు లేదని అంబటి ప్రశ్నించారు. కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసింది సీఎం జగన్ అనే విషయం గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. చంద్రబాబు ఎక్కడకు వెళితే అక్కడ శని దాపురిస్తుందని అంబటి విమర్శించారు.
పుష్కరాల్లో ఫోటో షూట్ కోసం 29 మందిని పొట్టన పెట్టుకున్నాచంద్రబాబులో పశ్చాత్తాపం లేదని అంబటి విమర్శించారు. జగన్ ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేశారు….ఎక్కడైనా జనం చచ్చిపోయారా? అని ప్రశ్నించారు. ఈ జీవో వైసీపీకి కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు.
కందుకూరు, గుంటూరు ఘటనల్లో 11 మంది చనిపోతే పెద్ద విషయం కాదా? అని అంబటి ప్రశ్నించారు. కుప్పంలో లాఠీ ఛార్జ్ జరిగి కార్యకర్తలు గాయపడినట్లు డ్రామాలు ఆడి పరామర్శ చేసే ఖర్మ చంద్రబాబుకు ఎందుకు వచ్చిందని అంబటి ప్రశ్నించారు. దుప్పట్లు, ఉల్లిపాయ, చింతపండు పంచే కార్యక్రమాలకు హాజరు అయ్యే దీన స్థితిలో చంద్రబాబు ఉన్నాడని ఎద్దేవా చేశారు.