Midday Meals: మధ్యాహ్న భోజనం తిని 51 మంది విద్యార్థులకు అస్వస్థత!
ఏపీలో మధ్యాహ్న భోజనం తిని 51 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా (Annamayya District)లో విద్యార్థులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. మధ్యాహ్నం భోజనం (Midday Meals) తిని విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో 51 మంది అస్వస్థతకు గురవ్వడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం విద్యార్థులంతా కోలుకున్నారు.
జిల్లాలోని మదనపల్లె (Madanapalli) మండలం, టేకులపాలెం ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనం (Midday Meals)లో బల్లి పడిన విషయం తెలియక ఆ భోజనాన్ని విద్యార్థులకు వడ్డించారు. భోజనం తిన్న 51 మంది విద్యార్థులు (51 students) అస్వస్థతకు గురవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
అస్వస్థతకు గురైన వారిలో 25 మంది బాలికలు ఉండగా 26 మంది బాలురు ఉన్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీవో ఆస్పత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. విద్యార్థులకు ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.