స్టార్ హీరోల సినిమాలపై రూమర్స్ రావడం కొత్తేం కాదు. ఒక్కసారి ప్రాజెక్ట్ అనౌన్స్ అయితే చాలు.. హీరోయిన్ ఎవరు? విలన్ ఎవరు? బడ్జెట్ ఎంత? స్టోరీ ఏంటి? ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తునే ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ పై కూడా అలాంటి రూమర్సే చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చరణ్ టీమ్ దీని పై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం చరణ్, శంకర్‌తో కలిసి ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సంక్రాతి లేదా సమ్మర్‌కు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు మెగా పవర్ స్టార్. ఇప్పటికే అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అయితే ముందుగా ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్నాడు బుచ్చిబాబు. కానీ తారక్ ఇతర కమిట్మెంట్స్ వల్ల.. ఈ కథ చరణ్ దగ్గరకి వెళ్లింది. ముందు నుంచి ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్లో రాబోతోందని.. అది కూడా ఓ క్రీడాకారుడి బయోపిక్ ఆధారంగా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చరణ్ ఉత్తరాంధ్ర యాస కూడా నేర్చుకుంటున్నాడనే రూమర్ మరింత వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఉత్తరాంధ్రకు చెందిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి జీవిత కథతో బుచ్చి బాబు కథ సిద్ధం చేశారనే టాక్ ఊపందుకుంది. అయితే ఈ వార్తలను మెగా పవర్ స్టార్ టీమ్ కొట్టిపారేసినట్టు తెలుస్తోంది. బయట జరుగుతున్నదంతా రూమర్స్ అని క్లియర్ కట్‌గా చెప్పేశారట. దీంతో ఆర్సీ 16 పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్టయింది. అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయినట్టు టాక్ నడుస్తోంది. ఇది కూడా రూమరే అంటున్నారు. మరి బుచ్చిబాబు ఆర్సీ 16 క్యాస్టింగ్‌ను ఎప్పుడు ఫైనల్ చేస్తాడో చూడాలి.