ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో మార్మోగుతున్న ఏకైక పేరు ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదలై సంవత్సరం కావొస్తున్నా.. వార్తల్లో నిలుస్తునే ఉంది. ఈసారి ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు జక్కన్న. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్.. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా దక్కించుకుంది. ఇక నెక్స్ట్ ఆస్కార్ కొట్టేయడమే లేట్ అంటున్నాయి హాలీవుడ్ ప్రిడిక్షన్స్. అయితే లేటెస్ట్ ప్రిడిక్షన్లో ఆస్కార్ టాప్ టెన్ లిస్ట్‌లో ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఆస్కార్ అఫిషీయల్ నామినేషన్స్‌కు ముందే.. ప్రముఖ మీడియా సంస్థలు తమ నామినేషన్స్ జాబితాలను వెల్లడిస్తున్నాయి.
ఇప్పటికే ‘వెరైటీ’ సంస్థ ప్రకటించిన టాప్ 10 బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో ఎన్టీఆర్‌కు 10వ స్థానం దక్కింది. తాజాగా యూఎస్ఎ టుడే అనే న్యూస్ డైలీ ప్రకటించిన జాబితాలో.. ఎన్టీఆర్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. అంతేకాదు.. ఈ జాబితాను లెక్కలోకి తీసుకోవాలని.. అకాడమీ ఓటర్లకు సూచించింది యూఎస్ఎ టుడే. దానికి కారణం కూడా రాసుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. అయితే.. ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే తీసుకోవాలి కాబట్టి.. క్రూర జంతువులకు నాయకత్వం వహించడంతో పాటు.. మోటార్ సైకిల్‌ను అవలీలగా ఎత్తి పడేసినందుకు.. ఎన్టీఆర్‌ను తాము నామినేట్ చేస్తున్నట్టు పేర్కొంది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో నిలిచి గెలుస్తాడేమో చూడాలి.