బెంగళూరు నారాయణ హృదయాల ఆస్పత్రికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటు నారా బ్రాహ్మణి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. అవసరమైతే విదేశాల నుంచి ప్రత్యేక వైద్యుల్ని పిలిపించాలని కుటుంబీకులు కోరారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని, 48 గంటలు గడిస్తేనే ఏమైనా చెప్పగలమని వైద్యులు తెలిపారు.
మరోవైపు ఆస్పత్రికి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడని తెలియడంతో కర్ణాటక హెల్త్ మినిస్టర్ సుధాకర్ ఆస్పత్రికి చేరుకున్నారు. సీఎం బొమ్మై ఆదేశాల మేరకు హెల్త్ మినిస్టర్ వైద్యులను అడిగి తారకరత్న ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తారక్, కళ్యాణ్ రామ్ ఆస్పత్రికి చేరడంతో వారితో సీఎం బొమ్మై మాట్లాడారు. ప్రస్తుతం ఎక్మో సపోర్ట్‌పైనే తారకరత్న ఉన్నారని, కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో తారకరత్నను చూడటానికి నందమూరి కుటుంబీకులు ఒక్కొక్కరే ఆస్పత్రికి చేరుకుంటున్నారు.