ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బాలకృష్ణ. ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతోంది. వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో దేవబ్రాహ్మణుల మనోభావాలను ఆయన దెబ్బతీసేలా మాట్లాడాడని నెట్టింట పెద్ద దుమారమే చెలరేగింది. ఆ తర్వాత వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో కూడా అక్కినేని నాగేశ్వరరావుని అవమానించేలా మాట్లాడ్డంతో కొందరు ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత నర్సులపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ తెలిపాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్లో బాలయ్య, తనకి గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడారు. ‘ఆ నర్సు, దానమ్మ భలే అందంగా ఉందిలే’ అంటూ బాలయ్య కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బాలకృష్ణ వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోని, నర్సులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. దీంతో బాలకృష్ణ స్పందిస్తూ నర్సులకు బహిరంగ లేఖతో క్షమాపణలు తెలిపాడు. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లు అయ్యింది. దేవబ్రాహ్మణుల వివాదంలో కూడా బహిరంగ క్షమాపణ చెప్పిన బాలయ్య, అక్కినేని వివాదంలో మాత్రం తాను క్షమాపణ చెప్పనంటూ చెప్పాడు. ప్రస్తుతం బాలకృష్ణ నర్సులకు క్షమాపణలు చెప్పిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.