Actor Brahmaji: మొదటి సినిమాకు వారంతా సపోర్ట్ చేశారు.. బ్రహ్మాజీ..!
సినిమా ఇండస్ట్రీలో హీరోలంతా తమ వారసులను కూడా హీరోలుగా చేస్తూ ఉంటారు. వారు మాత్రమే కాదు, ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మంది తమ పిల్లలను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేయాలని అనుకుంటూ ఉంటారు. ఈ దోవలోనే నటుడు బ్రహ్మాజీ తన కుమారుడిని హీరోగా పరిచయం చేశారు.
నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరోగా, ప్రణవి మానుకొండ హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రం జూలై 21న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ సోమవారం ప్రకటించారు. ఈ క్రమంలో బ్రహ్మాజీ తన కొడుకు సినిమాపై కామెంట్స్ చేశారు. తన కొడుకు మొదటి సినిమాకు మెగాస్టార్, సూపర్‌స్టార్, యంగ్‌టైగర్ ముందుకు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి.. ప్రమోట్ చేశారని, ప్రతీ సినిమాకు అలా అందరినీ పిలవడం బాగుండదని బ్రహ్మాజీ అన్నారు.
‘ నా కొడుకు హీరోగా ఎదిగినందుకు, ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉంది. కానీ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అతనికి సపరేట్గా నేనేమీ సలహాలు ఇవ్వలేదు, ఇవ్వను. ఈ తరంలో హీరోలు అందరూ సహజంగానే నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. తరువాత హీరో కోసం మా అబ్బాయిని తీసుకున్నారు. కథలు ఎంచుకోవడం, సినిమాలు సెలెక్ట్ చేసుకునే విషయంలో మా అబ్బాయికి ఎలాంటి సలహాలు ఇవ్వను. మొదటి సినిమా వరకు చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు ముందుకు వచ్చి ప్రమోషన్స్ చేశారు. ప్రతీ సినిమాకు అలా అందరినీ పిలవడం బాగుండదు. మొదటి సినిమాకు అందరూ ఆశీర్వాదం అందించారు. తర్వాత అన్నీ సినిమాలు మన కష్టం మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ ఎంత కష్టపడితే.. అంత సక్సెస్ వస్తుంది. మా అబ్బాయికి కూడా కష్టాన్నే నమ్ముకోమని చెబుతుంటాను. సినిమా విషయానికి వస్తే.. ఆద్యంతం అందరినీ చక్కగా ఎంటర్టైన్ చేసే సినిమా ఇది. సినిమా విడుదల తర్వాత ప్రతి ఒక్కరూ ఇదే అంటారు’ అని బ్రహ్మాజీ అన్నారు.