తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం పేరిట దంపతులు భారీ మోసం చేశారు. అమాయక ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయల మేర దండుకున్నారు. తమ పిల్లల భవిష్యత్ కోసం కష్టపడి సంపాదించిన సొమ్ము వారికి అప్పగించిన తల్లిదండ్రులు నిలువునా మోసపోయారు. మేనేజ్ మెంట్ కోటాలో ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు ఇప్పిస్తామని చెప్పడంతో ఆ దంపతులకు లక్షలు, వేలల్లో ఇచ్చి నట్టేటా మునిగారు. వారు బిచాణా ఎత్తేయడంతో లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని కాచిగూడలో జరిగింది.
అమాయక ప్రజలను మోసం చేసేందుకు భార్యాభర్తలు శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి ప్లాన్ వేశారు. రెండేండ్ల కిందట కాచిగూడలో సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో కార్యాలయం ప్రారంభించారు. గ్రోవెల్ ఎడ్యుకేషనల్ కెరీర్ సర్వీసెస్ పేరుతో సంస్థలు కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించారు. ఇంజనీరింగ్ సీటుకు రూ.10 లక్షల నుంచి 16 లక్షలు, మెడికల్ సీటుకి రూ.50 లక్షల నుంచి కోటి దాక వసూలు చేశారు. ఐదు నెలల నుంచి వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితులు మోసపోయామని గ్రహించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోతున్నారు. శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు.