మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్గా నటించగా.. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలు పోషించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
నళినీ రావు(అనుపమ పరమేశ్వరన్) జర్నలిస్ట్. తలకోన అడవుల్లో కొండలపై పండించే పత్తి, దాంతో తయారైన అరుదైన కాటన్ క్లాత్, ఆ వస్త్రాలకు విదేశాల్లో గుర్తింపు తెచ్చిన వ్యక్తి సహదేవ వర్మ(రవితేజ). అతని ఆచూకీ ఏడాదిగా ఎవరికీ తెలియదని చిన్న ఆర్టికల్ రాస్తుంది. దాంతో ఏకంగా పేపర్ ఆఫీస్ మీద సీబీఐ దాడులు చేస్తుంది. ఈ ఆర్టికల్ రాయడం వల్ల నళినీ రావు ఉద్యోగం కూడా పోతుంది. ఇంతకీ ఎవరీ సహదేవ వర్మ తెలుసుకోవాలని ఆమెలో క్యూరియాసిటీ మొదలవుతుంది. తలకోన అడవుల్లో కొండ మీద ఉన్న సహదేవ వర్మను పట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వ బలగాలు, నక్సల్స్, టెర్రరిస్టులు వెళ్తారు. అయితే వీళ్లు ఎందుకు అతనని పట్టుకోవాలని చూస్తున్నారు? సహదేవ వర్మ గతం ఏమిటి? అతని అనుచరుడు జై(నవదీప్) పాత్ర ఏమిటి? సహదేవ వర్మ, రచన(కావ్య థాపర్)కి మధ్ సంబంధం ఏంటి? అసలు వాళ్ల మధ్య ప్రేమ కథ ఎలా మొదలైంది? చివరకు సహదేవ వర్మను ఎవరైనా పట్టుకోగలిగారా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఈగల్ మూవీ మొదలైన కాసేపటి నుంచి హీరోకి బీభత్సమైన ఎలివేషన్లు కనిపిస్తాయి. ప్రతి సీన్ క్లైమాక్స్ అన్నట్లు మణిబాబు కరణం పదునైన సంభాషణలు రాశారు. అయితే ఆ ఎలివేషన్లు కొంత సమయం మాత్రమే. అసలు హీరోకి ఎందుకు అంత ఎలివేషన్స్? అసలు అతను ఎవరు? అని ప్రేక్షకుడి మదిలో మొదలైన ప్రశ్నకు సమాధానం చాలాసేపటి వరకు లభించదు. ఫస్టాఫ్ మొత్తం ఎలివేషన్లతో సాగుతుంది. అందువల్ల, యాక్షన్ సీన్లు మెప్పించినా ఏదో తెలియని అసంతృప్తి, వెలితి ఫస్టాఫ్‌లో కనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కథలోకి వెళ్లడంతో సినిమాపై ఒక క్లారిటీ వస్తుంది. పబ్జి నేపథ్యంలో ఫైట్ కూడా బాగుంది. దీంతో ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బెటర్ అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, రవితేజ నటన అద్భుతం. విధ్వంసం, వినాశనం, విస్ఫోటనం.. ఆ మారణ హోమం చేయడం మూలం ప్రేమ కథలో ఉంది. హీరో ఆలోచన వెనుక మానవాళికి చేసే మేలు ఉంది. ఆ సందేశం చిన్న సన్నివేశంలో చెప్పడం కంటే ఇంకా బాగా చెప్పి ఉంటే బాగుండేది. డేవ్ జాంద్ సంగీతం కాస్త కొత్తగా ఉంది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్ ఉన్న సినిమా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఖర్చుకు వెనుకాడలేదని ప్రతి సన్నివేశంలో తెలుస్తుంది. ప్రొడక్షన్ హౌస్ బ్రాండ్ వేల్యూ కనిపించింది.
ఎవరెలా చేశారంటే?
రవితేజ యాక్టింగ్ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి సీన్లో తన పెర్ఫామెన్స్‌తో సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీన్, మధుబాల, శ్రీనివాస్ అవసరాల వాళ్ల పాత్రల్లో జీవించారు. డైరక్టర్ రాసుకున్న కొన్ని డైలాగ్‌లు, యాక్షన్ సీన్లు బాగున్నాయి. ప్రతి క్యారెక్టర్‌కి ప్రాధాన్యత ఇస్తూ.. డైరక్టర్ స్టోరీని రాసుకున్న విధానం బాగుంది.
సాంకేతిక అంశాలు
టెక్నికల్ విషయానికొస్తే సినిమాటోగ్రాఫీ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది. డైలాగ్‌లు, మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా సినిమాకి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది.