దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం యాత్ర. ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యి హిట్ సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర 2 ఈరోజు విడుదల అయ్యింది. వైఎస్ఆర్ కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా రివ్యూలో తెలుసుకుందాం.
చిత్రం:యాత్ర 2 నటీనటులు: మమ్ముట్టి, జీవా, మహేశ్ మంజ్రేకర్, కేతకీ నారయణ్, సుజానే బెర్నెర్ట్, ఆశ్రిత వేముగంటి తదితరులు సంగీతం:సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: ఆర్ మధి దర్శకత్వం: మహి వి రాఘవ్ నిర్మాత: శివ మేక విడుదల:08/02/2024
కథ
యాత్ర 2 సినిమా రెండోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదలవుతుంది. గెలిచిన కొన్ని రోజులకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి(మమ్ముట్టి) మరణించడంతో వైఎస్ జగన్(జీవా) ఓదార్పు యాత్ర చేయాల్సి వస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ వద్దు అనడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయడం కోసం అధికారంలోకి వచ్చేందుకు జగన్(జీవా) ఎలాంటి పనులు చేశాడు? ఆయనను అధికారంలోకి రానివ్వకుండా ఎవరెవరు చేతులు కలిపారు? 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ ఎలా జగన్(జీవా) ఓటమికి కారణమైంది? 2019 ఎన్నికల్లో ఎలా జగన్ గెలిచి అధికారంలోకి వచ్చారు అలాంటి విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
సినిమా కథాంశం పరంగా చాలా సినిమాటిక్ యాంగిల్స్‌లో చూపించారు. అయితే అందరికి తెలిసిన కథ కావడంతో, స్క్రీన్ ప్లే పట్ల దర్శకుడు మరింత దృష్టి పెడితే బాగుండేది అనిపించింది. ప్రేక్షకులను కట్టిపడేసేలా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదనట్లు తెలుస్తోంది. కానీ, జగన్ ఢిల్లీ పెద్దలకు ఎదురువెళ్లడం, రాజకీయంగా ఎదిగిన తీరు ఆకట్టుకుంటోంది. అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్ వైఎస్ అభిమానులకు నచ్చేలా ఉంటాయి. సీఎం జగన్ పడిన ఇబ్బంది, ఆయనపై అక్రమ కేసులు, ఆయన ఎదుర్కొన్న బాధ, కుటుంబం పడిన నరకయాతన కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రధానంగా మమ్ముట్టి జీవా మధ్య జరిగే సీన్స్ అందరినీ కట్టిపడేస్తాయి. అయితే వైస్సార్ జగన్‌కు ఉన్న అభిమానగణానికి మాత్రం సినిమా తప్పకుండా నచ్చుతుంది. దానికి తోడు చివరి రెండు, మూడు నిమిషాలు జగన్ ఓదార్పు యాత్ర, పాదయాత్ర నిజమైన సన్నివేశాలను కూడా బాగుంటాయి. కానీ ఫస్టాఫ్ ఒకే అన్నట్టుగా ఉన్నా.. సెకండ్ హాఫ్ అంతగా మెప్పించదు. ఇందులో జగన్ సోదరి షర్మిల ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అసలు ఆమె పాత్ర ఉండదు. స్క్రీన్ మీద కనిపించే ప్రతి పాత్రకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ.. కథను అల్లుకున్న విధానం బాగుంది. నిజజీవితంలోని కొన్ని అంశాలను చూపించలేదు. అలాగే కొన్ని కల్పితంగా సృష్టించారి అర్థం అవుతుంది.
ఎవరెలా చేశారంటే?
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మరొకసారి మమ్ముట్టి మెరిశారు. స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువే అయినా సరే ఉన్నంతలో తనదైన శైలిలో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో ఆయన తప్ప మరొకరు న్యాయం చేయలేరు ఏమో అనేంతలా ఆయన ఒదిగిపోయారు. ఇక వైయస్ జగన్ పాత్రలో నటించిన జీవ కూడా చాలా బాగా చేశాడు. పోలికలు ఎక్కువగా లేకపోయినా మేనరిజం విషయంలో మాత్రం జగన్‌లానే అనిపించాడు. నటన కూడా ఆకట్టుకునేలా ఉంది. వైయస్ భారతి పాత్రలో నటించిన కేతకికి లభించింది చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ అయినా సరే భారతిని అచ్చుగుద్దినట్లు కనిపించే ఆమె ఉన్నంతలో బాగానే నటించింది. వైయస్ విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి తనలైన శైలిలో నటించింది. సచిన్ ఖేడ్కర్, మహేష్ మంజ్రేకర్ వంటి వారు తమ తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు
టెక్నికల్ అంశాల విషయానికొస్తే సంతోష్ నారాయణ అందించిన మ్యూజిక్ బాగుతంది. పాటలు సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా మారాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమా విజువల్స్‌కి ఒక రిచ్ లుక్ బాగుందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ కూడా బాగుందనే చెప్పుకోవచ్చు.