బీసీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత చంద్రబాబుదైతే, తగ్గించిన ఘనత జగన్ దే అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళంలో భాగంగా రెండరోజు కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించిన జగన్ ను ఇంటికి పంపాల్సిందేనన్నారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే పాత పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 20 నుంచి 34 శాతానికి రిజర్వేషన్లు పెంచిన ఘనత చంద్రబాబుది అయితే, 24 శాతానికి తగ్గించిన ఘనత జగన్ ది అన్నారు. పాదయాత్ర ద్వారా అందరికి న్యాయం చేస్తానన్న జగన్, అధికారంలోకి వచ్చాక సంక్షేమంలో కోత వేశారని మండిపడ్డారు. బోయలను ఎస్టీలలో చేరుస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కురుబ కులస్థులకు గ్రామ గ్రామాన ఆలయాలు కట్టిస్తామని, ఆలయ నిర్మాణాల కోసం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వడ్డెరలకు గనులలో రాళ్లు కొట్టుకొనే అవకాశం పునరుద్ధరిస్తామన్నారు.
జగన్‌లా తప్పుడు హామీలు ఇవ్వనని, పూర్తి స్థాయిలో పరిశీలన చేశాక అమలు చేయగలిగే వాటిపైనే హామీ ఇస్తునట్లు చెప్పారు. శాసనసభలో తమ తల్లి పట్ల అగౌరవంగా మాట్లాడిన వారిని వదలిపెట్టనని హెచ్చరించారు. దొంగ బీసీ సర్టిఫికెట్లు జారీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. బీసీలను సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఆదుకోవాల్సిన అవసరముందన్నారు.