కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ధనుష్ సినిమాకు తెలుగులో భారీ నష్టాలు తప్పవంటున్నారు. తమిళంలో ఏకంగా వంద కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా కనీసం ఇక్కడ కోటి కూడా రాబట్టలేకపోయిందని అంటున్నారు.
Captain Miller: ఓ భాషలో హిట్ అయిన సినిమా మరో చోట హిట్ అవుతుందనే గ్యారెంటీ లేదు. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా అంటూ అన్ని భాషల్లో కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. కానీ ధనుష్ లేటెస్ట్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ తమిళ్ నెటివిటీకి మాత్రమే కనెక్ట్ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ సినిమా తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే.. తెలుగులోను సంక్రాంతికి రావాల్సిన కెప్టెన్ మిల్లర్.. థియేటర్ల సమస్య కారణంగా రెండు వారాలు ఆలస్యంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ సినిమా.. అసలు తెలుగులో రిలీజ్ అయిందా? లేదా? అనే సందేహాలు రాక మానదు. తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా థియేటర్లోకి వచ్చింది కెప్టెన్ మిల్లర్.
అందుకు తగ్గట్టే నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు నేటివిటీకి దూరంగా ఉండడంతో.. కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ నాలుగు కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. కానీ నాలుగు రోజుల్లో రెండు కోట్లకుపైగా గ్రాస్‌ను.. కోటి వరకు షేర్ రాబట్టి డిజాస్టర్ దిశగా సాగుతోంది. దీంతో కెప్టెన్ మిల్లర్‌కు నష్టాలు తప్పవని అంటున్నారు. అరుణ్ మాథేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సందీప్‌కిషన్ గెస్ట్ రోల్ చేశాడు. అయినా కూడా తెలుగులో అలరించలేకపోయింది. చివరగా ఇక్కడ ‘సార్’ వంటి సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చిన ధనుష్‌కు ఇది షాకింగ్ అనే చెప్పాలి.